ప్రమాద ఘంటికలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:11 AM
Depleting groundwater levels జిల్లాలో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. వర్షాలు అనుకూలించకపోవటం, ఎల్‌నినో ప్రభావం భూగర్భజలాలపై పడింది. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 5.91 మీటర్లలో భూగర్భజలాలు ఉండగా.. ప్రస్తుతం 6.81 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే ఏడాది వ్యవధిలో 0.9 మీటర్లు తగ్గుముఖం పట్టాయి.
అడుగంటుతున్న భూగర్భజలాలు
ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన నీటినిల్వలు
ప్రజలకు తప్పని అవస్థలు
ఎచ్చెర్ల రూరల్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భజలాలు తగ్గుతున్నాయి. వర్షాలు అనుకూలించకపోవటం, ఎల్‌నినో ప్రభావం భూగర్భజలాలపై పడింది. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో 5.91 మీటర్లలో భూగర్భజలాలు ఉండగా.. ప్రస్తుతం 6.81 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే ఏడాది వ్యవధిలో 0.9 మీటర్లు తగ్గుముఖం పట్టాయి. తాగునీరు, సాగునీరుతోపాటు పశువుల సంరక్షణ, పరిశ్రమల నిర్వహణకు భూగర్భజలాలే ఆధారం. కాగా అవసరానికి మించి వినియోగం, వర్షాభావ పరిస్థితులు, చెరువుల ఆక్రమణ కారణంగా జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రధానంగా జిల్లాలో కవిటి, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, వజ్రపుకొత్తూరు తదితర మండలాల్లో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో పడిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో 10.83 మీటర్లలో, ధర్మవరంలో 14.13 మీటర్లలో, కవిటి మండల కేంద్రంలో 35.58 మీటర్లలో భూగర్భజలాలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరులో 29.11 మీటర్లలో ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నచోట గ్రీన్‌బిల్ట్ లేక పోవటం, భూగర్భ జలాలు అధికంగా వినియోగించటం సైతం సమస్యగా మారింది. భూగర్భజాలు పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో తాగునీటి, సాగునీటి సమస్యలు తప్పవని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మండలాల్లో ఇదీ పరిస్థితి
సరుబుజ్జలి, ఎల్.ఎన్.పేట, జి.సిగడాం, టెక్కలి, హిరమండలం, ఇచ్ఛాపురం మండలాల్లో 0- 3.0 మీటర్ల మధ్యలో భూగర్భజలాలు ఉన్నాయి.
గార, శ్రీకాకుళం, పొందూరు, పోలాకి, మెలియాపుట్టి, జలుమూరు,పాతపట్నం, బూర్జ, మందస, ఆమదాలవలస, కొత్తూరు, నందిగాం మండలాల్లో 3.1 - 6.0 మీటర్ల మధ్యలో భూగర్భ జలాలు లభిస్తున్నాయి.
సంతబొమ్మాళి, నరసన్నపేట, లావేరు, సోంపేట, ఎచ్చెర్ల, సారవకోట, పలాస, కోటబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, కంచిలి, రణస్థలం మండలాల్లో 6.1 - 20 మీటర్ల మధ్యలో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి.
రీచార్జ్ తప్పనిసరి
ప్రస్తుతం 9 శాతం వర్షపునీరు రీచార్జ్ తప్పనిసరికి చర్యలు తీసుకోవాలి. నీటిని పొదుపుగా వినియోగించాలి. వర్షపునీరు వృథాకాకుండా.. నిల్వ ఉంచేలా చర్యలు చేపట్టాలి. ఇంటివద్ద ఇంకుడు గుంతలు తవ్వటం, చెక్‌డ్యాంలు, ఫారంపాంట్‌లు వంటివి నిర్మించాలి. 33 శాతం గ్రీన్‌బెల్టుకు కృషి చేయాలి. మరోపక్క వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి, తృణధాన్యాలు సాగు వంటివి అవసరం. జిల్లాలో భూ గర్భ జల, నీటియాజమాన్య, అటవీ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా భూగర్భ జలాలు పెంపునకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు.
ఆందోళన అవసరం లేదు
గతేడాది కన్నా ఈ ఏడాది భూగర్భజలాలు తగ్గినప్పటికీ.. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 8 నుంచి 20 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. భూగర్భజలాల పెంపునకు ప్రజల భాగస్వామ్యం అవసరం. పచ్చదనం పెంచాలి. రీచార్జ్‌ఫిట్‌లు ఏర్పాటు చేయాలి.
- ఎన్‌వీకే దుర్గాప్రసాద్, భూగర్భ జలాలు శాఖ, డీడీ
నీటి వినియోగం త గ్గాలి
నీరు వృథా కాకుండా వినియోగాన్ని తగ్గించాలి. సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పెరుగుతుండడంతో భూమిలో వర్షపునీరు ఇంకటం లేదు. వరికి ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర, సామ, ఊదలు, పెసర, మినుము, కంది వంటి పంటలు సాగు చేయాలి. ఇంకుడు గుంతలు ద్వారా భూమిలో నీటిని ఇంకించాలి. చిన్న చెక్ డ్యాంలు నిర్మించి నీటి నిల్వలు పెంచాలి. వ్యవసాయంలోని నీటి వినియోగం తగ్గించే మెక్రో ఇరిగేషన్ అమలు చేయాలి.
- డి.రమేష్, జియాలజిస్ట్