జిల్లాకు తుఫాన్ ముప్పు
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:15 AM
Very heavy rains from tomorrow ‘బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
రేపటి నుంచి అతి భారీ వర్షాలు
గంటకు 90 కి.మీ. వేగంతో గాలులు
అందరూ అప్రమత్తంగా ఉండాలి
మత్స్యకారులు వేటకు వెళ్లరాదు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ‘బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాకు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఆదివారం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘ఈ తుఫాన్ కాకినాడ-అనకాపల్లి ప్రాంతాల నడుమ తీరం దాటవచ్చు. జిల్లాలో దీని ప్రభావం ఉంటుంది. జిల్లాలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ఈ నెల 27, 28 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. జిల్లాలోని 11 తీరప్రాంత మండలాలు, నాగావళి, వంశధార నదీ పరీవాహక ప్రాంతాల్లోని 13 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నదులకు వరద పోటెత్తే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి 30 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు. అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి. విపత్తు సమయంలో ప్రజలకు సత్వర సహాయం అందించేందుకు జిల్లాకేంద్రంలో ఒకటి, డివిజన్ స్థాయిలో మూడు, మండలాల వారీగా 30 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామ’ని తెలిపారు. పునరావాస కేంద్రాలలో అన్ని వసతులతోపాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రాబోయే 3 నుండి 4 రోజులపాటు ముందుగానే సమీపంలోని ఆసుపత్రుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు
జిల్లా కలెక్టరేట్ ః 08942 - 240557
శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయం ః 9494233490
టెక్కలి ఆర్డీఓ కార్యాలయం ః 9704033093
పలాస ఆర్డీవో కార్యాలయం ః 7386189275