Share News

తుఫాన్‌ గండం

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:06 AM

బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ‘అక్వాన్‌’ తుఫాన్‌ జిల్లా వైపు కదులుతోంది.

 తుఫాన్‌ గండం
ఊడికలపాడులో వరిచేను కుప్పలు పెడుతున్న రైతులు

- ఇచ్ఛాపురం వద్ద తీరం దాటే అవకాశం

- గంటకు 60-80 కి .మీ. వేగంతో గాలులు

- కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌

- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- రైతుల్లో ఆందోళన

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ‘అక్వాన్‌’ తుఫాన్‌ జిల్లా వైపు కదులుతోంది. ఇచ్ఛాపురం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇచ్ఛాపురం ప్రాంతంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని, క్షేత్రస్థాయి సిబ్బందిని ఇప్పటికే రంగంలోకి దించామని తెలిపారు. తుఫాన్‌ తీవ్రత అంతగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదని కోరారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున పూరిళ్లు, గుడిసెలు, రేకుల ఇళ్ల కింద నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు లేదా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలి వెళ్లాలని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌ సేవలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08942-240557 (రాష్ట్రస్థాయి టోల్‌ ఫ్రీ నెంబర్లు 1070, 1800, 425, 0101) 24 గంటలూ పనిచేస్తుందని, ఏదైనా ఆపద సంభవిస్తే తక్షణమే సమాచారం అందజేయాలని కోరారు. గత తుఫాన్‌ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, విద్యుత్‌ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలగించామన్నారు. ఒకవేళ గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకొరిగితే పట్టణ ప్రాంతాల్లో 4 గంటల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 8 గంటల్లోగా మరమ్మతులు పూర్తిచేసి, సరఫరాను పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల ముప్పునకు సంబంధించి ఒక డిప్యూటీ కలెక్టర్‌ను ఇప్పటికే నియమించామన్నారు. తుఫాన్‌ అనంతరం సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రసవ గడువు దగ్గరగా ఉన్న గర్భిణులను ముందుగానే సమీపంలోని పీహెచ్‌సీలకు తరలించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఉద్యానవన అధికారి ప్రసాదరావు, విపత్తు నిర్వహణ సంస్థ అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.

‘అక్వాన్‌’పై అప్రమత్తం: మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తుఫాన్‌ కారణంగా జిల్లాలో ఈనెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. శ్రీకాకుళం, అంబేడ్కర్‌ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రాణ, ఆస్తి, నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అధికారుల సమష్టి కృషితో ఇప్పటికే రెండు తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఈ అక్వాన్‌ తుఫాన్‌ను కూడా ఎదుర్కోవాలని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. నదీపరివాహక ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒడిశాలో వర్షాలు కురిస్తే జిల్లాలో వరదలు వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేయాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని అన్నారు.

రైతుల్లో ఆందోళన

ఎచ్చెర్ల/కోటబొమ్మాళి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరి అయిన రైతులు ఇప్పుడు అక్వాన్‌ తుఫాన్‌ హెచ్చరికతో దిగులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రైతులు వరి కోతల్లో తలమునకలై ఉన్నారు. చివరి దశలో ఉన్న వరిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఎచ్చెర్ల మండలం ధర్మవరం, రామజోగిపేట, ముద్దాడ తదితర ప్రాంతాల్లో, కోటబొమ్మాళి మండలం ఊడికలపాడు తదితర గ్రామాల్లో రైతులు కోతకోసిన వరిని పొలాల్లో కుప్పలుగా పెడుతున్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:06 AM