తుఫాన్ టెన్షన్
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:07 AM
Heavy rains for three days starting today బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. జిల్లాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని, మంగళ, బుధవారాల్లో అసాధారణస్థాయిలో కుంభవృష్టిగా కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపఽథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
జిల్లాలో నేటి నుంచి మూడురోజులు భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరిక
కలెక్టర్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అత్యవసర సమీక్ష
ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
శ్రీకాకుళం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. జిల్లాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని, మంగళ, బుధవారాల్లో అసాధారణస్థాయిలో కుంభవృష్టిగా కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపఽథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్రపౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆదివారం రాత్రి తన చాంబర్ నుంచి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ సమక్షంలో విపత్తు నిర్వహణపై అత్యవసర సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మండలాల వారీగా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకుండా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. రైతుల కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించేందుకు విద్యుత్‌శాఖ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. ముంపు ప్రాంతాల్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడంతోపాటు, అత్యవసర వైద్యసేలు అందించేలా వైద్య బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వపరంగా అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
తీరప్రాంత మండలాలకు ప్రత్యేకాధికారులు
తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 11 తీరప్రాంత మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రణస్థలం మండలానికి సుడా అధికారి పొగిరి సుగుణాకరరావు, ఎచ్చెర్లకు పశుసంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాలరావు, శ్రీకాకుళానికి డ్వామా పీడీ లవరాజు, గారకు డీపీవో ఆర్.స్వరూపరాణి, పోలాకికి జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. వీరు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మండల యంత్రాంగాన్ని నిరంతరం సమన్వయం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. అవసరమైన చోట ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు.
వాయుగుండం నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నెల 21 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సిబ్బంది సెలవులను డీఎంహెచ్‌వో డాక్టర్ ఈవీ నరేష్ రద్దు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ముందస్తు చర్యలకు సిద్ధమవ్వాలని ఆదేశించారు.