Share News

వంశధార తీరం జనసందోహం

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:48 PM

మేజరు పంచాయతీ హిరమండలంలోని సుభలయి మెట్టపై వెలసి ఉన్న వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధారనదిలో గురువారం ఘనంగా నిర్వహించారు.

వంశధార తీరం జనసందోహం
స్వామివారిని ఊరేగింపుగా నదిలోకి తీసుకువెళ్తున్న భక్తులు

  • ఘనంగా వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు

హిరమండలం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మేజరు పంచాయతీ హిరమండలంలోని సుభలయి మెట్టపై వెలసి ఉన్న వేంకటేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాలు వంశధారనదిలో గురువారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన డోలోత్సవాలు వైభవంగా సాగాయి. ఆఖరి ఘట్టమైన చక్రతీర్థ స్నానాలకు కొత్తూరు, పాతపట్నం, ఎల్‌ఎన్‌ పేట, హిరమండలం మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో వంశధార నదీ తీరం జనసంద్రంగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై ఊరేగింపుగా తీసుకువెళ్లి వంశధార నదిలో చక్రస్నానం చేయించారు. అక్కడకు వచ్చే భక్తులకు సుభలయి గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తూరు సీఐ ప్రసాదరావు ఆధ్వర్యంలో హిరమండలం, కొత్తూరు ఎస్‌ఐలు వి.హేమంత్‌, వెంకటేష్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 05 , 2026 | 11:48 PM