Share News

భక్తజన రద్దీ.. ఈసారీ అదే ఇబ్బంది

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:15 AM

Arasavalli rathasapthami అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు భక్తజనం పోటెత్తారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. అరసవల్లి ఆలయ ప్రాంగణమంతా ఎటుచూసినా భక్తజన సందడి కనిపించింది. కాగా.. వేడుకల్లో కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాహకంతో భక్తులకు ఈసారీ ఇబ్బందులు తప్పలేదు.

భక్తజన రద్దీ.. ఈసారీ అదే ఇబ్బంది

  • రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు

  • అమలుకు నోచుకోని ప్రణాళికలు

  • క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో తప్పని అవస్థలు

  • పోలీసుల అత్యుత్సాహంతో చేతులెత్తేసిన అధికారులు

  • కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షించినా.. మారని తీరు

  • శ్రీకాకుళం/అరసవల్లి/పాత శ్రీకాకుళం/ క్రైం/ స్పోర్‌ ్ట్స/ లీగల్‌ (ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో రథసప్తమి వేడుకలకు భక్తజనం పోటెత్తారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. అరసవల్లి ఆలయ ప్రాంగణమంతా ఎటుచూసినా భక్తజన సందడి కనిపించింది. కాగా.. వేడుకల్లో కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది నిర్వాహకంతో భక్తులకు ఈసారీ ఇబ్బందులు తప్పలేదు. ‘ఎన్నడూ లేని విధంగా ఈసారి రథసప్తమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తాం. అరగంటలోనే స్వామి దర్శన భాగ్యం కల్పిస్తామ’ని అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేశారు. కానీ అమలులో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి. కొంతమంది అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతారాహిత్యం, పోలీసుల అత్యుత్సాహంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటలకొద్దీ క్యూలో నిరీక్షణతో అవస్థలు పడ్డారు. సుమారు రెండు లక్షలమంది భక్తులు తరలివస్తారని అంచనా వేసిన అధికారులు.. అందుకు ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని భక్తులు ఆరోపించారు. తాము ఆన్‌లైన్‌లో టైమ్‌ స్లాట్‌లో ముందుగానే టిక్కెట్లు బుక్‌ చేసుకున్నామని, అయినా సరే ఈ నరకం ఏంటని భక్తులు పోలీసులు, సిబ్బందిని నిలదీశారు. అలాగే స్వామి దర్శనానికి వచ్చే మార్గంలో స్థానిక పెద్దతోట వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వీవీఐపీలు కూడా చాలాసేపు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఆర్చి వద్ద కూడా అదే పరిస్థితి ఎదురవడంతో అసహనం వ్యక్తం చేశారు.

  • క్యూలైన్లు కలిసిపోయి..

  • కొంతమంది ఉద్యోగులు, పోలీసులకు సరైన అవగాహన లేకపోవడం, దారి చూపించే మార్గదర్శనం బోర్డులో స్పష్టత లేకపోవడం వల్ల సామాన్య భక్తులు గందరగోళానికి గురయ్యారు. ప్రధాన మార్గం గుండా వెళ్లాల్సిన రూ.500 టిక్కెట్లు కలిగిన భక్తులు, అదే విదంగా డోనర్‌ పాసులు ఉన్న భక్తులు మార్గం నేరుగా ఉంటే.. అక్కడ పోలీసులు, దేవాలయ సిబ్బంది సంత తోట మార్గం వైపు మళ్లించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గ్రామస్థులకు కేటాయించిన లైన్‌, ఉచిత దర్శనాలకు క్యూలైన్లు, రూ.100 లైన్లు అన్నీ తూర్పు మార్గంలో కలిసిపోవడంతో రద్దీ పెరిగిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పరిస్థితి అదుపు తప్పింది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రంగంలోకి దిగి భక్తులను అదుపు చేశారు. ఆలయ ఈవో కూడా భక్తులకు సర్దిచెప్పారు.

  • మార్గదర్శనం కరువు...

  • భక్తులకు సరైన మార్గదర్శనం చేసే వలంటీర్లు కరువయ్యారు. తూర్పువైపు ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద పోలీసులు కూడా అంతంతమాత్రమే ఉన్నారు. క్యూలైన్‌లో ప్రవేశించే వద్ద ఒక్కసారిగా భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులు కూడా కష్టతరంగా మారింది. అసిరితల్లి అమ్మవారి గుడి దగ్గర ఉన్న క్యూలైన్‌లో తోపులాట జరిగి భక్తులు కొంతమంది పడిపోయారు. సకాలంలో సహాయకులు వారిని బయటకి లాగడంతో పెనుగండం తప్పింది. కేశఖండనశాలకు చేరుకునే దారి కూడా అత్యంత ఇబ్బందిగా మారింది. స్నానాలకు కొద్దిసేపు సరిపడినంత నీరు రాకపోవడంతో అవస్థలు పడ్డారు. ఏ క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయో సూచించే బోర్డులు ఉన్నా సరిగా లేకపోవడం, ఉచిత క్యూలైన్లు వద్ద ఎక్కువ సంఖ్యలో వలంటీర్లు నియమించకపోవడం వలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడ్డారు.

  • కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షించినా..

  • శనివారం అర్ధరాత్రి నుంచి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి భక్తుల క్యూలైన్ల వద్దకు వెళ్లి వారికి సజావుగా దర్శనం కల్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీవీఐపీ దర్శనాల క్యూలైన్లు నరసన్నపేటకు చెందిన ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారి నిర్వాకంతో గంటల కొద్దీ కిక్కిరిసిపోయి, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లైన్లు ఖాళీగా ఉన్నాసరే, కిందిస్థాయి సిబ్బందిపై జులుం ప్రదర్శించి, గంటల కొద్దీ భక్తులను ఆపివేయడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అనంతరం కలెక్టర్‌ స్వయంగా వీవీఐపీ క్యూలైన్‌ వద్దకు చేరుకుని, భక్తులకు సజావుగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎస్పీ నిరంతరం బందోబస్తును పర్యవేక్షిస్తూ, సిబ్బందికి ఎప్పటికప్పుడే సూచనలు చేస్తూ, భక్తులకు సజావుగా దర్శనం కల్పించాలని సూచించారు. కొంతమంది కిందిస్థాయి సిబ్బంది ఎస్పీ ఆదేశాలు బేఖాతరు చేయడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

  • దివ్యాంగుల పరిస్థితి దయనీయం....

  • స్వామివారిని దర్శించుకునేందు వచ్చిన దివ్యాంగుల పరిస్థితి దయనీయంగా మారింది. సింహద్వారం వద్దకు చేరుకున్నా సరే అక్కడ విధుల్లో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ అనుమతించకపోవడంతో శ్రీకాకుళానికి చెందిన ముద్దాడ ఆదినారాయణ అనే దివ్యాంగుడు విలపించాడు. అలాగే ఆలయానికి చెందిన సిబ్బంది వాకీటాకీతో సహా అక్కడకు వచ్చి కంప్యూటర్‌ ప్రింటర్లు ఆఫీసు నుంచి తీసుకువెళ్లాలని, టిక్కెట్ల జారీలో జాప్యం జరుగుతోందని, బతిమలాడినా ఆ పోలీసు అనుమతించలేదు. అలాగే చిన్నారులకు పాలు అందించేందుకు కూడా పోలీసులు ఎక్కడా.. ఎవరినీ అనుమతించకపోవడంతో అవస్థలు పడ్డారు. మొత్తమ్మీద తీవ్ర ఇబ్బందులు పడుతూనే భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:15 AM