Share News

జిల్లాలో పంటల ఉత్పత్తి పుష్కలం

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:56 AM

జిల్లాలో పంటల ఉత్పత్తి పెంచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు పీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.

  జిల్లాలో పంటల ఉత్పత్తి పుష్కలం
మాట్లాడుతున్న ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్‌డీ సత్యనారాయణ

- ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ

అరసవల్లి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంటల ఉత్పత్తి పెంచేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు పీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ మండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తర కోస్తా జిల్లాల్లో నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పాదకత పెంచవచ్చని తెలిపారు. రైతుల వద్దకు పరిశోధన ఫలితాలు చేరవేయడం ద్వారా వివిధ పంటల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయ ప్రతినిధి ఏవీ రమణ మాట్లాడుతూ.. ఉత్తర కోస్తా జిల్లాల్లో తక్కువ భూసారం ఉంటుందని, నేలలో కార్బన్‌ శాతాన్ని పెంచడంతో పాటు, జీవన ఎరువుల వినియోగం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని తెలిపారు. దీంతో వరి, నూనెగింజల సాగు ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. నాబార్డు జీఎం రవికృష్ణ మాట్లాడుతూ.. డ్రోన్‌ టెక్నాలజీ వినియోగానికి గాను ఆర్థిక సహాయం అందజేస్తామని, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. తక్కువ ఖర్చుతో లాభసాటి వ్యవసాయం ఉండేలా సాంకేతికతలను రూపొందించి, రైతులకు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారులు చర్చించి 2026-27 సంవత్సరానికి గాను కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అభ్యుదయ రైతులు, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ సీహెచ్‌.ముకుందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 12:56 AM