జీడి పరిశ్రమకు సంక్షోభం
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:02 AM
Cashew industry.. loss పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పలాస జీడి పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటినుంచి విదేశాలకు జీడి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.
యుద్ధంతో విదేశాలకు నిలిచిన ఎగుమతులు
దేశీయంగానే కొనసాగుతున్న విక్రయాలు
సరైన మార్కెట్ లేక ఒడిదొడుకులు
నష్టపోతున్నామంటున్న వ్యాపారులు
ప్రత్యామ్నాయ వ్యాపారాలపై మొగ్గు
పలాస, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పలాస జీడి పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటినుంచి విదేశాలకు జీడి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఒకపక్క జీడి పప్పును దేశీయంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం.. మరోపక్క మార్కెట్‌లో సరైన ధర లేకపోవడం వారిని మరింత కుంగుబాటుకు గురిచేస్తోంది. వ్యాపారలావాదేవీలు సక్రమంగా సాగక కొందరు యువ పారిశ్రామికవేత్తలు జీడీ పరిశ్రమలకు బదులు ప్రత్యామ్నాయ వ్యాపారాలు వెతుక్కోవాల్సి వస్తోంది. దీనికారణంగానే రామకృష్ణాపురం వద్ద ఏపీఐఐసీ నెలకొల్పిన పారిశ్రామికవాడలో జీడి పరిశ్రమల స్థాపనకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.
ఇదీ పరిస్థితి..
శ్రీకాకుళం జిల్లా అంటేనే జీడి పరిశ్రమలకు ప్రసిద్ధి. ముఖ్యంగా పలాస మార్కెట్ ఉదయమంతా జీడి కార్మికులతో.. సాయంత్రం వ్యాపారులతో కళకళలాడుతుంటుంది. ఇక్కడ 20వేల మంది కార్మికులు, వెయ్యిమంది వరకూ వ్యాపారులు ఉన్నారు. అలాంటి జీడిమార్కెట్ ఒక్కసారిగా బోసిపోయింది. ఇక్కడ లభిస్తున్న పప్పు గత మూడు నెలలుగా విదేశాలకు ఎగుమతి జరగడం లేదు. మన దేశంలోనే అమ్ముకోవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల్లో పండిన పంట కూడా మన దేశానికే పరిమితం కావడంతో పలాస జీడిపప్పు అంతగా రుచించడం లేదు. దీంతో పప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. చేసేది లేక తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు పప్పు తయారీకి అయ్యే ఖర్చులో వ్యత్యాసం కారణంగా ఇక్కడి వ్యాపారులు ఇతర రాష్ట్రాల మార్కెట్‌ధాటికి తట్టుకోలేకపోతున్నారు. బస్తాకు ఇతర రాష్ట్రాల్లో రూ.800 వరకూ ఖర్చు అవుతుండగా, పలాస మార్కెట్‌లో మాత్రం బస్తాకు ఏకంగా రూ.1600 వెచ్చించాల్సి వస్తోంది. పైగా జీడిపప్పు ధరలతో కూడా ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతుంది.
కొత్త వ్యాపారం వైపు చూపు..
జీడి వ్యాపారం మొదటి నుంచి చేస్తున్న వ్యాపారులు ప్రస్తుత మార్కెట్‌తో పోటీ పడలేకపోతున్నారు. దీన్ని నమ్ముకొని పనిచేయాల్సి వస్తోంది తప్ప లాభాలు మాత్రం రావడం లేదనేది వారి వాదన. ఈ క్రమంలో యువ వ్యాపారులు కొత్త వ్యాపారాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది జీడి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంగిలిగాం పారిశ్రామికవాడలో 50వరకూ జీడి పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. వ్యాపారుల అవసరార్థం కొత్తగా రామకృష్ణాపురం వద్ద 60 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కొత్త పారిశ్రామికవాడను నిర్మించారు. దీన్ని ప్రారంభించి ఏడాది అవుతున్నా ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి మార్కెట్‌కు కూడా తగిన అవకాశాలు ఇస్తే పలాస జీడి పరిశ్రమ బతుకుతుంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అనేక జీడి పరిశ్రమలు మార్కెట్ లేక ఎత్తివేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.
జీడిపప్పు ధరలు(కిలో)
....................................
రకం రూపాయలు
180 - 820
210 - 760
240 - 730
320 - 700
400 - 670
జేహెచ్(బద్ద) - 730
కే - 680
పీసెస్ - 550
జీడి పిక్కల బస్తా(80) కిలోలు : రూ.12,800
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
జీడి ఎగుమతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. మన జీడి మన దేశానికే పరిమితం కావడం వల్ల అంతగా అమ్మకాలు జరగడం లేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. లేదంటే వ్యాపారులంతా నష్టం చవిచూడాల్సి వస్తుంది.
- కేవీ శివకృష్ణ, మాజీ ప్రధాన కార్యదర్శి, జీడి వ్యాపారుల సంఘం