పలాస మునిసిపాలిటీలో అక్రమాలపై కొరడా
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:56 PM
Disciplinary action against five former commissioners పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో భవన నిర్మాణాల అనుమతులు, అక్రమ కట్టడాల వ్యవహారంలో ఐదుగురు మాజీ కమిషనర్లు చిక్కుల్లో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం, విజిలెన్స్ విచారణకు సహకరించకపోవడం వంటి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
ఐదుగురు పూర్వ కమిషనర్లపై క్రమశిక్షణ చర్యలు
విజిలెన్స్ విచారణకు సహాయ నిరాకరణ
అక్రమ కట్టడాలకు అనుమతులపై అభియోగాలు
ఒకేరోజు ఏడు జీవోలు జారీ చేసిన పురపాలకశాఖ
పది రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం
శ్రీకాకుళం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో భవన నిర్మాణాల అనుమతులు, అక్రమ కట్టడాల వ్యవహారంలో ఐదుగురు మాజీ కమిషనర్లు చిక్కుల్లో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం, విజిలెన్స్ విచారణకు సహకరించకపోవడం వంటి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్ శుక్రవారం ఏడు జీవోలు జారీ చేశారు. సంబంధిత అధికారులు జీవోలు అందిన పది రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఐదుగురు అధికారులపై అభియోగాలు
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం, అక్రమ కట్టడాలను నిరోధించకపోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేపట్టింది. అప్పట్లో కమిషనర్లుగా పనిచేసిన ఐదుగురు అధికారుల పాత్రపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొందరు అధికారులు విచారణకు సహకరించలేదని నివేదికలో పేర్కొంది. దీంతో ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991లోని రూల్ 20 కింద ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.
చర్యలు ఎదుర్కొంటున్న అధికారులు
సీహెచ్ సత్యనారాయణ: పలాస కమిషనర్‌గా పనిచేసిన ఈయన ఉద్యోగ విరమణ పొందారు. అక్రమ కట్టడాల తొలగింపులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీగా విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారనే అభియోగాలపై చర్యలకు ఆదేశించారు.
ఎన్.రమేష్‌నాయుడు: ప్రస్తుతం వజ్రపుకొత్తూరు ఎంపీడీవోగా పనిచేస్తున్నారు.
నాగేంద్రకుమార్: ప్రస్తుతం కొవ్వూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నారు.
బీఆర్‌ఎస్ శేషాద్రి: ప్రస్తుతం పాలకొల్లు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. విజిలెన్స్ విచారణకు సహకరించలేదన్న అభియోగం ఉంది.
పిల్లా జగన్‌మోహన్: ప్రస్తుతం విజయవాడలో ఏపీ ఫైబర్‌నెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పలాసలో పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు విజిలెన్స్ విచారణకు సహకరించలేదన్న అభియోగాలు ఉన్నాయి.
నలుగురిపై ఉమ్మడి విచారణ
ఉద్యోగ విరమణ పొందిన సత్యనారాయణ మినహా మిగిలిన నలుగురు అధికారులపై ఉమ్మడి విచారణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిపై ఉమ్మడి విచారణ జరపనున్నారు. అధికారులు జీవోలు అందిన పది రోజుల్లోగా తమ వివరణలను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.