కాలువను కప్పేసి..
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:06 AM
Government land grab ఆయనో ప్రైవేటు వైద్యుడు. రెండేళ్ల కిందట కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అక్కడ రియల్ వెంచర్ వేసేందుకుగాను.. ఆ స్థలానికి సమీపంలోని 12 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు. కాలువను సైతం ఆక్రమించి కప్పేయడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ భూమిపై ఓ ప్రైవేటు వైద్యుడి కన్ను
12 సెంట్ల స్థలం ఆక్రమణ
రియల్ వెంచర్‌గా మార్చేందుకు సన్నాహాలు
సంతబొమ్మాళి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఆయనో ప్రైవేటు వైద్యుడు. రెండేళ్ల కిందట కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అక్కడ రియల్ వెంచర్ వేసేందుకుగాను.. ఆ స్థలానికి సమీపంలోని 12 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు. కాలువను సైతం ఆక్రమించి కప్పేయడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో ముంపు సమస్య తప్పదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఇక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన సూపర్ స్పెషాలిటీ వైద్యుడు 2024లో సంతబొమ్మాళి మండలంలోని హెచ్.ఎన్.పేట పంచాయతీ పోతునాయుడుపేట రెవెన్యూ పరిధిలోని ఈస్టుకోస్టు పవర్‌ప్లాంట్ సమీపంలో డీపీఎన్ రోడ్డు పక్కన.. ప్రైవేటు భూమిని కొనుగోలు చేశాడు. ఇక్కడి నుంచి డీపీఎన్ రోడ్డుకు రావాలంటే మధ్యలో 12సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీంతో ఆ స్థలాన్ని వైద్యుడు ఇటీవల కబ్జా చేసేశాడు. రియల్ వెంచర్లు వేసేందుకుగాను మొత్తం భూమిని మట్టితో చదును చేయించి.. ఈ ప్రాంతంలో ఉన్న కాలువను సైతం కప్పేశాడు. ఈ ప్రాంతంలో సెంటు ధర రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు పలుకుతోంది. దీని ప్రకారం వైద్యుడు కబ్జా చేసిన ప్రభుత్వ స్థలం విలువ రూ.40లక్షలకుపైగా ఉంటుంది. కాగా అధిక వర్షాలు కురిస్తే ఈ ప్రాంతంలో పంటలు ముంపునకు గురయ్యేవి. ప్రస్తుతం రోడ్డు పక్కన కాలువ కప్పేయడంతో ముంపు ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైద్యుడికి కొంతమంది ఉద్యోగులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై సంతబొమ్మాళి తహసీల్దార్ బి.హేమసుందర రావు వద్ద ప్రస్తావించగా.. పోతునాయుడుపేటలో ఆక్రమణలను తొలగిస్తామన్నారు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.