Share News

కాలువను కప్పేసి.. మట్టి తరలించి

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:01 AM

Sunamudhi canal covered మట్టి మాఫియా అక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. రెండు మండలాల్లో 4వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సునాముది కాలువను అక్రమార్కులు మట్టితో కప్పేశారు. ఆపై సమీప పొలాల్లో మట్టి తవ్వకాలు చేపట్టి.. తరలింపునకు అనుకూలంగా మార్గం చేసుకున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాలువను కప్పేసి.. మట్టి తరలించి
పైపు వేసి.. మట్టితో కప్పేసి చదును చేసిన సునాముది కాలువ ఇదే

  • రెండు మండలాల్లో 4 వేల ఎకరాలకు ముప్పు

  • ఆందోళనలో ఆయకట్టు రైతులు

  • అక్రమార్కులపై అధికారులకు ఫిర్యాదు

  • హరిపురం, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మట్టి మాఫియా అక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. రెండు మండలాల్లో 4వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే సునాముది కాలువను అక్రమార్కులు మట్టితో కప్పేశారు. ఆపై సమీప పొలాల్లో మట్టి తవ్వకాలు చేపట్టి.. తరలింపునకు అనుకూలంగా మార్గం చేసుకున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..

  • మందస మండలంలోని సునాముది కాలువ ద్వారా మందస, సోంపేట మండలాల పరిధిలో 4వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మందస మండలం భిన్నాళ మదనాపురం, వరదరాజపురం, హరిపురంతోపాటు సోంపేట మండలం తాళ్లభద్ర, రాణిగాం, మామిడిపల్లి, పాత్రపురం, తురక శాసనం, గొల్లవూరు, గొడియాగట్టు, ఎకువూరు వంటి 22 గ్రామాల్లో రైతులకు ఈ కాలువే ఆధారం. కానీ కొంతకాలంగా నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ఆక్రమణకు గురికావడంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. హరిపురం-మందస రోడ్డుకు ఆనుకుని ఈ కాలువపై మట్టి, ఇసుక, కంకర మాఫియా కన్ను పడింది. వాల్టా నిబంధనలకు విరుద్ధంగా ఈ కాలువ సమీప పొలాల్లో మట్టిని అక్రమార్కులు తవ్వి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు అడ్డంకిగా ఉన్న ఈ కాలువను మట్టితో కప్పేశారు. కిందన పైపులు వేసి.. పైన మట్టి నింపేశారు. విషయం తెలుసుకున్న రైతులు శనివారం అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం అందించారు. సునాముది కాలువ కబ్జాకు గురైందని.. ఇప్పుడు ఏకంగా కాలువను కప్పేశారని రైతులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఘటనా స్థలానికి రాగా వినతిపత్రం అందించారు. కాలువ నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు. ఈ మేరకు అధికారులు కాలువపై మట్టిని తొలగించే చర్యలు చేపడుతున్నారు. సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు.

  • రైతులంటే చిన్నచూపు..

  • రైతులు ఏమి చేయలేరనే చిన్నచూపుతో.. కాలువను కప్పేశారు. ఇది చాలా దారుణం. దాదాపు 10 గ్రామాల రైతులకు ప్రధాన ఆధారం ఈ కాలువ. ఇప్పటికే నిర్వహణ లేక పూర్తిగా నిర్వీర్యమైంది. తక్షణం అధికారులు దృష్టిపెట్టి కబ్జా కోరల నుంచి సునాముది కాలువను కాపాడాలి.

  • - పోలేటి హేమరాజు, ఆయకట్టు రైతు

  • చర్యలు తీసుకుంటాం

  • రైతుల ఫిర్యాదు మేరకు సునాముది కాలువను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. భూసర్వే చేయించి కాలువ భూమి ఆక్రమణకు గురైతే స్వాధీనం చేసుకుంటాం. పైపులు వేసి మట్టి కప్పిన వారిపై అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తాం సాగునీటికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపడతాం.

    - శ్రీనివాసరావు, ఏఈఈ, జలవనరుల శాఖ, మందస

Updated Date - Jun 07 , 2026 | 12:01 AM