Share News

వైద్యుల చీటీ ఉంటేనే దగ్గుమందు

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:15 AM

Changes to pharmaceutical regulations ఇకపై దగ్గుమందు కొనాలంటే సంబంధిత రోగికి వైద్యుల చీటీ(ప్రిస్కిప్షన్‌) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్రిటీష్‌ కాలం నాడు 1945లో ఉన్న ఔషధ నిబంధనలు మార్పు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

వైద్యుల చీటీ ఉంటేనే దగ్గుమందు

ఔషధ నిబంధనలు మార్పు చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం

టెక్కలి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఇకపై దగ్గుమందు కొనాలంటే సంబంధిత రోగికి వైద్యుల చీటీ(ప్రిస్కిప్షన్‌) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్రిటీష్‌ కాలం నాడు 1945లో ఉన్న ఔషధ నిబంధనలు మార్పు చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు, ఫార్మాసిస్ట్‌ల కొరత మూలంగా ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే పలు రకాల మందులు విక్రయించేవారు. అలాగే 20ఏ లైసెన్స్‌ కలిగిన ఔషధ షాపుల్లో కొన్నిరకాల మందుల విక్రయాలకు అవకాశం ఉండేది. ప్రస్తుతం వైద్యులు, ఔషధ మందులు విక్రయించే షాపులు విపరీతంగా పెరిగాయి. ఔషధ దుకాణాల వారు వైద్యులు రాసిన చీటీలతో సంబంధం లేకుండానే పలురకాల మందులు విక్రయిస్తున్నారు. అందులో దగ్గుమందు ఒకటి. వాస్తవానికి దగ్గు రెండు రకాలు. పొడిదగ్గు(దగ్గుతూ ఉండడం), తడిదగ్గు (కపంతో దగ్గడం). వైద్యులు రోగిలో ఉన్న లక్షణాలను నిర్ధారించి వైరస్‌ కనిపెట్టి మందుల చీటీ రాయాలి. కానీ చాలామంది వైద్యుల వద్దకు వెళ్లకుండానే మందుల దుకాణంలో దగ్గుమందు కొనుగోలు చేసి వాడుతున్నారు. అలాగే దగ్గు మందుల్లో కొడిన్‌ పాస్ఫేట్‌ ఉండడంతో మత్తులా ఉపయోగపడుతుందని భావించి మరికొందరు దీనిని వినియోగిస్తున్నారు. దగ్గు మందు ఎక్కువగా వినియోగించడం రోగికి ప్రాణాంతకంగా మారుతుంది. గత ఏడాది రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిప్‌ అనే దగ్గుమందు వలన పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం కావడంతో దీనిపై లోతుగా ఔషధ అధికారులు విచారణ చేసి ఈ తరహా సిరప్‌పై నిషేధం కూడా విధించారు. పలురకాల రంగుల్లో వినియోగిస్తున్న సాల్వెంట్లు కలిగినవి కూడా దగ్గుమందుల్లో ఉండడం ఒక్కోసారి రోగికి ప్రాణాంతకంగా మారుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ భావించి తాజా ఆంక్షలు అమలు ప్రారంభించింది.

వైద్యుల సూచన మేరకే వాడాలి :

దగ్గు ఏ రకమైనది అన్నది ముందుగా గుర్తించిన తరువాతే రోగికి సరిపడా మందుని వైద్యుల సూచన మేరకే వాడాలి. కొడిన్‌ పాస్ఫేట్‌ మోతాదు ఉన్న దగ్గు మందుల్ని పిల్లలకు ఇవ్వకూడదు. ఔషధ షాపుల్లో ఏ రకమైన దగ్గుమందులు వినియోగిస్తున్నారో ఔషధశాఖ అధికారులు పర్యవేక్షించాలి. వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌తో దగ్గుమందు కొనుగోలు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ తీసుకున్న నిర్ణయం మంచిదే.

- డాక్టర్‌ లక్ష్మణరావు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, టెక్కలి

Updated Date - Jun 17 , 2026 | 12:15 AM