పునాదులకు అవినీతి బీటలు
ABN , Publish Date - May 29 , 2026 | 12:03 AM
Poor building work వైసీపీ హయాంలో చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అవినీతిమయం చోటుచేసుకుంది. నాసిరకం నిర్మాణాలతో భవనాల పనుల నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. హిరమండలం మండలం మర్రిగూడ పంచాయతీలో నిర్మించిన విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతుసేవా కేంద్రాల భవనాల పునాదులు పగుళ్లతో దర్శనమిస్తున్నాయి.
నాసిరకంగా సచివాలయాల భవనాల పనులు
వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లు
ఎప్పుడు కూలుతాయోనని సిబ్బందిలో ఆందోళన
హిరమండలం మండలం ఏ.మర్రిగూడలో విలేజ్ హెల్త్‌క్లినిక్, మర్రిగూడలో రైతుసేవా కేంద్రం భవనాలు ఇవి(పై చిత్రాలు). వైసీపీ హయాంలో నాసిరకంగా నిర్మించడంతో భూకంపం మాదిరి పునాదులకు సైతం పగుళ్లు ఏర్పడ్డాయి. గోడలు బీటలువారాయి. దీంతో ఉద్యోగులతోపాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గోడలకు, పునాదులకు పగుళ్లు రావడంతో.. ఎప్పుడు ఈ భవనాలు కూలిపోతాయోమోనని హడలిపోతున్నారు.
హిరమండలం, మే 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో అవినీతిమయం చోటుచేసుకుంది. నాసిరకం నిర్మాణాలతో భవనాల పనుల నాణ్యత ప్రశ్నార్థకమవుతోంది. హిరమండలం మండలం మర్రిగూడ పంచాయతీలో నిర్మించిన విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతుసేవా కేంద్రాల భవనాల పునాదులు పగుళ్లతో దర్శనమిస్తున్నాయి. అప్పట్లో అదేపార్టీకి చెందిన కాంట్రాక్టర్లు ఈ పనులు చేపట్టారు. రూ.22 లక్షలతో రైతుసేవాకేంద్రం, రూ.17 లక్షలతో విలేజ్ హెల్త్‌క్లినిక్ నిర్మించారు. కాగా నాసిరకం నిర్మాణాల కారణంగా ప్రస్తుతం కూలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పునాదులు చెదురుతున్నాయి. భవనాల వరండాల్లోని మెట్లు, ఫ్లోరింగ్ కుంగిపోయాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటం, కాంట్రాక్టరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో నిర్మించిన కొన్నేళ్లకే భవనాలు ఈ స్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాల్లో మేడలు కట్టిన చందంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి ఈ భవనాలకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ విషయమై పీఆర్ జేఈ దుర్గాప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో మర్రిగూడ పంచాయతీలో విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతుసేవా కేంద్రాల భవనాల పనులు చేపట్టారు. నేను ఇటీవల బాధ్యతలు చేపట్టాను. ఈ భవనాలను పరిశీలించి.. మరమ్మతులకు చర్యలు చేపడతామ’ని తెలిపారు.