బండ బాదుడు
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:19 AM
Gas price increase గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపింది. ఏడాది కాలం నుంచీ గ్యాస్ ధరలు పెంచలేదు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సుమారు 11 నెలల తరువాత తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి.
వంట గ్యాస్ ధర రూ.60 పెంపు
కమర్షియల్ సిలిండర్‌పై రూ.144
జిల్లా ప్రజలపై నెలకు రూ.7 కోట్ల భారం
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావమే కారణం
శ్రీకాకుళం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపింది. ఏడాది కాలం నుంచీ గ్యాస్ ధరలు పెంచలేదు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సుమారు 11 నెలల తరువాత తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి. తాజాగా గృహవసర వినియోగ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.144 చొప్పున పెరిగింది. కాగా.. శుక్రవారం వరకు గృహ వినియోగం గ్యాస్ సిలిండర్(14.2 కేజీలు) ధర రూ.844.50 ఉండగా, శనివారం నుంచి 904.50కి చేరింది. వాణిజ్య సిలిండర్(19 కేజీలు) ధర రూ.1,980.50 ఉండగా.. కొత్తగా పెంచిన ధరతో 2,124.50కి పెరిగింది. దీంతో జిల్లా ప్రజలపై నెలకు ఏకంగా రూ.7 కోట్లకుపైగా భారం పడనుంది. దాదాపు 70 శాతం గ్యాస్ సరఫరా గల్ఫ్ దేశాల నుంచి ఉంటోంది. ప్రస్తుతం ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో సరఫరా లేక.. డీలర్ల వద్ద నిల్వలు తగ్గిపోయాయి. అందుకే చమురు సంస్థలు గ్యాస్ ధరను పెంచినట్టు తెలుస్తోంది.
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లను పరిశీలిస్తే... సింగిల్ సిలెండర్ వినియోగిస్తున్నవారి సంఖ్య 2,00,264. డబుల్ సిలెండర్‌లను వినియోగిస్తున్న వారి సంఖ్య 1,40,054. దీపం పథకంలో సింగిల్ సిలిండర్ల లబ్ధిదారులు 2,10,780 మంది, డబుల్ సిలిండర్లు ఉన్నవారు 30,588 మంది ఉన్నారు. ఉజ్వల పథకంలో 93,194, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) కింద ఇచ్చిన కనెక్షన్లు 17,945.. మొత్తం 6,92,825 గృహవినియోగదారుల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిపై నెలకు రూ.60 చొప్పున అదనపు ధర లెక్కిస్తే.. రూ.4.15 కోట్లకుపైగా భారం పడనుంది. కొత్త ధరలతో సామాన్యులు మాత్రం విలవిల్లాడిపోతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీపం పథకం 2.0 కింద ఏడాదికి మూడు సిలిండర్ల డబ్బులను వారి వినియోగదారుల ఖాతాల్లో వేస్తోంది. ఈ విషయం కాస్త ఊరటనిస్తోంది.
అప్పుడు తగ్గించి...ఇప్పుడు భారీగా పెంచి..
హోటళ్లు, రెస్టారెంట్లు.. వ్యాపార సంస్థలు.. వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరపై రూ. 144 పెంచారు. జిల్లాలో సుమారుగా 2లక్షల వరకు వాణిజ్య గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన జిల్లాలో వ్యాపారులపై నెలకు రూ.2.88 కోట్లకుపైగా భారం పడనుంది. కమర్షియల్ గ్యాస్ సిలెండర్‌పై గత పదకొండు నెలలో ఏడుసార్లు కాస్త అటు ఇటుగా ధరలు తగ్గించారు. ఇప్పుడు ఆ లోటును రెట్టింపు చేసేలా ధరలు అమాంతం పెంచేశారని హోటళ్ల నిర్వాహకులు, చిరువ్యాపారులు వాపోతున్నారు.