ఉత్సవాల పర్యవేక్షణకు కంట్రోల్‌రూమ్
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:35 PM
Festivals at Srimukhalingam జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ‘కంట్రోల్ రూమ్’ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు.
శ్రీముఖలింగంలో పక్కాగా ఏర్పాట్లు
అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): జలుమూరు మండలం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ‘కంట్రోల్ రూమ్’ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ‘ఉత్సవాల సమయంలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్‌లో ప్రతీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సిబ్బంది విధుల్లో ఉంటారు. కేటాయించిన విభాగాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును వీరు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఏ సమస్య తలెత్తినా, వెంటనే స్పందించాలి. విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్యరోగ్యశాఖ, పోలీసుశాఖలకు చెందిన ప్రతినిధులు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. భక్తుల రద్దీని బట్టి క్యూలైన్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాల’ని కలెక్టర్ ఆదేశించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా వచ్చే దృశ్యాలను నిశితంగా పరిశీలించి, భద్రతను పటిష్టం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి సూచించారు. ‘వేడుకల్లో భాగంగా చక్రతీర్థ యాత్రకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్కింగ్ స్థలాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామ’ని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఏఎస్పీ కేవీ రమణ, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.