శ్రీకాకుళంలో రహదారుల అభివృద్ధికి సహకరించండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:21 AM
Development of roads శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణకు సహకరించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విన్నవించారు.
కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వినతి
న్యూఢిల్లీ/ అరసవల్లి/ పలాస, మార్చి 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణకు సహకరించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విన్నవించారు. గురువారం నితిన్ గడ్కరీతో పార్లమెంటులోని ఆయన కార్యాలయంలో రామ్మోహన్‌నాయుడు భేటీ అయ్యారు. ‘శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి 16ను ఆరు లైన్లుగా విస్తరించాలి. శ్రీకాకుళంలోని పలు ముఖ్య కూడళ్లలో ఫ్లైఓవర్లను నిర్మించాలి. రాష్ట్ర రహదారులుగా ఉన్న కళింగపట్నం- శ్రీకాకుళం-పార్వతీపురం(145 కి.మీ), గార-అలికాం-బత్తిలి(118 కి.మీ) రహదారులను జాతీయ రహదారులుగా మార్చాల’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కోరారు. తన విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. దీంతో నరసన్నపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఆరులైన్ల జాతీయ రహదారి నిర్మిస్తే సిక్కోలుకు మహర్దశ పట్టనుందని జిల్లావాసులు భావిస్తున్నారు.
మూడు రైళ్లకు హాల్ట్.. ఫలించిన కేంద్రమంత్రి చొరవ
జిల్లాలో ఒకేసారి మూడుస్టేషన్లలో రైళ్లకు కొత్తగా హాల్ట్‌లు లభించాయి. మందసరోడ్, హరిశ్చంద్రపురం, పాతపట్నం రైల్వేస్టేషన్‌లో వివిధ రైళ్లు హాల్ట్(నిలుపుదల) సౌకర్యం కల్పిస్తూ రైల్వేశాఖ గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇకపై 59505/58506 గుణుపూర్-విశాఖపట్నం పాసింజర్ రైలును హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్‌లోను, 18525/18526 బ్రహ్మపూర్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును మందస రోడ్‌లో, 18117/18118 రూర్కెలా-గుణుపూర్ రాజారాణి ఎక్స్‌ప్రెస్ పాతపట్నం రైల్వే స్టేషన్‌లో ఆపనున్నారు. ఈ మేరకు జాయంట్ డైరెక్టర్(కోచింగ్), జాయంట్ డైరెక్టర్ రైల్వేబోర్డు సభ్యుడు రాజేష్‌కుమార్ నుంచి ఆదేశాలు అందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే హాల్ట్‌లకు సంబంధించి కేంద్రపౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఈ నెల 3న రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రైళ్ల హాల్టుల ఆవశ్యకతను వివరించారు. ఈ మేరకు మూడు రైళ్లకు హాల్ట్‌లు కల్పించడంతో కేంద్రమంత్రి కృషి ఫలించిందంటూ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధితోపాటు ప్రజారవాణా మరింత సులభతరం అవుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.