నవ్విపోదురు గాక...
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:23 AM
Today at 'Chalo Moolapet Port' సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పనుల సందర్శన విషయంలో వైసీపీ నేతల తీరు.. ‘నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది.
మూలపేట పోర్టు పనులపై వైసీపీ నాయకుల విరుద్ధ ప్రకటనలు
నేడు ‘చలో మూలపేట పోర్టు’కు సన్నాహాలు
వాస్తవాలు తెలుసుకోవాలని జిల్లావాసుల హితవు
కూటమి పాలనలో శరవేగంగా పనులు పూర్తయ్యాయని స్పష్టం
వైసీపీ హయాంలో మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తిచేశాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు ఆగిపోయాయి. ఎందుకంటే అప్పట్లో పోర్టుకు శంకుస్థాపన చేసిన నాకు పేరు రాకూడదనేది కూటమి నేతల దురుద్దేశం.
- ఇవీ ఈ నెల 25న వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో మూలపేట పోర్టు పనులు 70 శాతం జరిగాయి. కూటమి ప్రభుత్వం హయాంలో పోర్టు పనులు గాలికొదిలేశారు. పోర్టు నిర్మాణంపై నిజనిజాలు చెప్పేందుకు ఈ నెల 30న నిర్వహించనున్న ‘పోర్టుకు పోదాం’ కార్యక్రమం విజయవంతం చేయాలి.
- ఇదీ ఈ నెల 28న కార్యకర్తల సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు
టెక్కలి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పనుల సందర్శన విషయంలో వైసీపీ నేతల తీరు.. ‘నవ్విపోదురు గాక.. నాకేటి సిగ్గు’ అన్న చందంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ‘చలో మూలపేట పోర్టు’ కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ‘జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు. దశాబ్దాల పాలనలో టీడీపీ జిల్లాకు చేయలేని పనులు.. వైఎస్ జగన్ ఐదేళ్లలో చేసి చూపించార’ ని వైసీపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతూ.. ఈ కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నారు. కాగా.. కూటమి పాలనలో మూలపేటలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ వేసవిలోనే షిప్ ట్రైల్‌రన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ‘మన మూలపేట పోర్టుకు పోదాం రండి’ అని పిలుపునివ్వడంపై జిల్లావాసులు ఎద్దేవా చేస్తున్నారు. పనుల విషయంలో ఆ పార్టీ నాయకులు విరుద్ధ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.
వాస్తవమిదీ..
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఏప్రిల్ 19న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. కానీ పోర్టుకు అవసరమైన భూసేకరణ, ఉప్పు భూములు సమస్య, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, ల్యాండ్ ఎక్విజేషన్, పీడీఎఫ్‌లు చెల్లింపులు, రోడ్డు, రైలు కనెక్టివిటీలకు అవసరమైన భూసేకరణ ఏదీ పూర్తిస్థాయిలో చేపట్టలేదు. ఈ సమస్యలు పరిష్కరించకుండానే శంకుస్థాపన చేసేశారు. పోర్టు లోపల సుమారు రూ.717 కోట్లు వెచ్చించి.. 23 శాతం పనులు మాత్రమే చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పోర్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. రూ.1,885కోట్లు వెచ్చించి 75 శాతం పనులు పూర్తయ్యాయి. అంతేకాకుండా ల్యాండ్ ఎక్విజేషన్, పీడీఎఫ్‌లకు సుమారు రూ.50కోట్లు, ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి సంబంధించి సుమారు రూ.20కోట్ల పనులు కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులు ఊకదంపుడు ప్రచారం కోసం ‘మూలపేట పోర్టుకు పోదాం రండి’ అనే కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టుకు సంబంధించిన అభివృద్ధి క్రెడిట్‌పై బురద జల్లేందుకే వైసీపీ నాయకులు ఈ పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.