కాంట్రాక్ట్ దక్కలేదని.. కడతేర్చాలని..
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:15 AM
Three people including YCP municipal vice-chairman arrested పలాస రైల్వేస్టేషన్ వద్ద బైక్ పార్కింగ్ నిర్వహణకు కొత్తగా కాంట్రాక్టు పొందిన వ్యక్తితోపాటు ఆయన అనుచరులను హత్య చేసేందుకు వైసీపీ నాయకుడు, మునిసిపల్ వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు, ఆయన బాబాయ్‌లు మీసాల మోహనరావు, మీసాల చిన్నారావు, బావమరిది మున్నా(సుదీప్) కుట్రపన్నారు. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పార్కింగ్ నిర్వాహకులపై నాటు తుపాకీ, కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ సంఘటనలో పి.మధు అనే వ్యక్తి స్వల్పగాయాలతో బయట పడ్డాడు.
బైక్ పార్కింగ్ నిర్వాహకుడు, అనుచరులను చంపేందుకు యత్నం
వైసీపీ మునిసిపల్ వైస్‌చైర్మన్ సురేష్‌బాబుతో సహా ముగ్గురి అరెస్టు
నాటు తుపాకీ, కత్తులు, కర్రలు స్వాధీనం
పలాస, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్ వద్ద బైక్ పార్కింగ్ నిర్వహణకు కొత్తగా కాంట్రాక్టు పొందిన వ్యక్తితోపాటు ఆయన అనుచరులను హత్య చేసేందుకు వైసీపీ నాయకుడు, మునిసిపల్ వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు, ఆయన బాబాయ్‌లు మీసాల మోహనరావు, మీసాల చిన్నారావు, బావమరిది మున్నా(సుదీప్) కుట్రపన్నారు. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పార్కింగ్ నిర్వాహకులపై నాటు తుపాకీ, కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ సంఘటనలో పి.మధు అనే వ్యక్తి స్వల్పగాయాలతో బయట పడ్డాడు. నిందితులపై గతంలో అనేక కేసులు నమోదై ఉన్నాయి. బెయిల్‌పై ప్రస్తుతం ఉంటూ ఈ దురాగతానికి పాల్పడినట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఈ వివరాలను వెల్లడించారు.
పలాస రైల్వేస్టేషన్‌లో మోటారు వాహనాల పార్కింగ్ కాంట్రాక్టును వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు, ఆయన బాబాయ్‌లు మీసాల మోహనరావు, మీసాల చిన్నారావుతోపాటు బావమరిది మున్నా గత 13 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖుర్ధారోడ్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన పార్కింగ్ వేలంలో వీరికి టెండర్లు దక్కలేదు. ఖుర్ధారోడ్‌కు చెందిన కణితి జగన్నాథరావు అనే వ్యక్తికి పలాస రైల్వేస్టేషన్‌లో మోటారు వాహనాల పార్కింగ్ కాంట్రాక్టు దక్కింది. మూడేళ్ల నిర్వహణకుగాను రూ.50లక్షలు, జీఎస్‌టీ రూ.5లక్షలు కలిపి రూ.55లక్షలకు వేలంలో టెండర్‌ను దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నుంచి మోటారు వాహనాల పార్కింగ్ నిర్వహణను జగన్నాథరావుకు అప్పగించాల్సి ఉంది. ఈమేరకు జగన్నాథరావు తన అనుచరుడు పి.మధుబాబుతో పాటు మరి కొంతమందితో కలసి ఈ నెల 9వ తేదీ రాత్రి పార్కింగ్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తమకు కాంట్రాక్టు దక్కలేదనే అక్కసుతో జగన్నాథరావు, ఆయన అనుచరులను అంతమొందించాలని వైసీపీ నాయకుడు, మునిసిపల్ వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు, ఆయన బాబాయ్‌లు మీసాల మోహనరావు, మీసాల చిన్నారావు, బావమరిది మున్నా(సుదీప్) కుట్రపన్నారు. 9న అర్ధరాత్రి దాటిన తరువాత చిన్నారావు నాటుతుపాకీతో వారిని కాల్చి హత్య చేయడానికి యత్నించాడు. మోహనరావు.. మధుబాబుపై కత్తితో దాడి చేయగా స్వల్పగాయాలతో బయట పడ్డాడు. సురేష్‌బాబు, ఆయన బావమరిది మున్నా కత్తులు, కర్రలతో వారిపై దాడి చేశారు. మొత్తం వ్యవహారం బైక్ స్టాండులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితులు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. సీఐ వై.రామకృష్ణ, ఎస్‌ఐ నర్సింహమూర్తి తమ బృందాలతో నిందితుల కోసం గాలించారు. ఆదివారం కోసంగిపురం రోడ్డు సమీపంలో వారంతా అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకున్నారు. మున్నా పరారీ అయ్యాడు. ఆయన కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి ఒక నాటు తుపాకీ, నాలుగు తూటాలు, మూడు కత్తులు, రెండు కర్రలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై గతంలో అనేక కేసులు..
మీసాల మోహనరావు, చిన్నారావు, సురేష్‌బాబుపై గతంలో అనేక కేసులు ఉన్నాయని, వీరిపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మోహనరావు, చిన్నారావుపై మొత్తం ఎనిమిది కేసులు, సురేష్‌బాబుపై నాలుగు కేసులు ఉన్నట్లు చెప్పారు. హత్యలు, మారణాయధాలతో బెదిరించడం, రోబరీ, హత్యాయత్నం వంటి కేసులు వీరిపై ఉన్నట్లు తెలిపారు.
వైసీపీలో కలకలం..
హత్యాయత్నం కేసులో మునిసిపల్ వైస్‌చైర్మన్ మీసాల సురేష్‌బాబు అరెస్టు కావడం వైసీపీలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈయన 4వ వార్డు అంబుసోలి, పద్మనాభపురం కాలనీ, ఇందిరానగర్ కాలనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో ఈయన్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో పలాస రైల్వే బైక్ పార్కింగ్ వ్యవహారంలో అరెస్టు కావడం చర్చనీయాంశమైంది.