Share News

‘స్వచ్ఛ’మైన మోసం

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:35 AM

Haphazard maintenance of RO water plants జిల్లాలో నీటి వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. పల్లెలు, పట్నాల్లో ఎక్కికక్కడ పుట్టగొడుగుల్లా వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. ప్లాంట్ల నిర్వాహకులు స్వచ్ఛమైన ఆర్వో వాటర్‌ పేరుతో మినరల్‌ ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

‘స్వచ్ఛ’మైన మోసం

  • మినరల్‌ ముసుగులో.. కలుషిత దందా!

  • జిల్లాలో ఇష్టారాజ్యంగా ఆర్వో వాటర్‌ప్లాంట్ల నిర్వహణ

  • కిడ్నీవ్యాధుల భయంతో క్యాన్లకే జనాల మొగ్గు..

  • సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

  • శ్రీకాకుళంలో ‘పీహెచ్‌7’ గుట్టురట్టు

  • శ్రీకాకుళం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీటి వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. పల్లెలు, పట్నాల్లో ఎక్కికక్కడ పుట్టగొడుగుల్లా వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. ప్లాంట్ల నిర్వాహకులు స్వచ్ఛమైన ఆర్వో వాటర్‌ పేరుతో మినరల్‌ ముసుగులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలను పాటించకుండా.. కనీస శుద్ధి చేయని కలుషిత నీటినే క్యాన్లు, బాటిళ్లలో నింపి విక్రయిస్తున్నారు. జిల్లాలో కిడ్నీవ్యాధుల సమస్య అధికంగా ఉండటంతో సురక్షితం అనే ఉద్దేశంతో ప్రజలు ఈ నీటిని కొనుగోలు చేస్తుండటంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. శ్రీకాకుళంలో కొన్ని దశాబ్దాలుగా వాటర్‌ క్యాన్లు, బాటిళ్లను అత్యధికంగా విక్రయిస్తున్న సంస్థ ‘పీహెచ్‌7’. ఈ ప్లాంట్‌లో జరుగుతున్న కలుషిత నీటి బాగోతాన్ని శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు ఇటీవల రట్టు చేశారు. ఆ ప్లాంట్‌ను మూసివేశారు. దీన్నిబట్టి దశాబ్దాలుగా జనాలు డబ్బులిచ్చి మరీ ఎలాంటి రోగాల బారిన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

  • జిల్లాలో 26 ప్లాంట్లకే అనుమతులు

  • ఆహారకల్తీ నియంత్రణ విభాగం సమాచారం ప్రకారం.. జిల్లాలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ అనుమతులు పొందిన వాటర్‌ ప్లాంట్లు కేవలం 26 మాత్రమే ఉన్నాయి. ఇందులో శ్రీకాకుళం డివిజన్‌లో 16, పలాస డివిజన్‌లో 10 ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో వీధికొక ఆర్వో ప్లాంట్‌ చొప్పున నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. లైసెన్సులు తీసుకున్నవారు ముందుగా నీటి నాణ్యత (పీహెచ్‌) పరీక్షలు చేయించాలి. ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో నీటి నమూనాలను పరీక్షించి, మైక్రో బయాలజీ టెస్టులు చేయించాలి. వాటర్‌ప్యాకెట్లు, సీసాలు, క్యాన్ల తయారీ అనేది యూనిట్‌-1 కిందకు వస్తే.. వీధుల్లో అమ్మే క్యాన్లు, ప్యాకెట్లు యూనిట్‌-2 పరిధిలోకి వస్తాయి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. నగర సమీపంలోనే ఉన్న ఎచ్చెర్ల, చిలకపాలెం తదితర ప్రాంతాల్లో వాటర్‌ప్లాంట్లు వెలిశాయి. వీటి తనిఖీల జోలికే అధికారులు వెల్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే నగరంలోని ప్లాంట్లపై దృష్టి సారిస్తున్నారుగానీ.. రూరల్‌ ప్రాంతాల్లో ఉన్నవాటిని పట్టించుకోవడం లేదు.

  • నకిలీ లేబుళ్లతో మోసం

  • ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అడ్డగోలుగా నీటిని అమ్ముతున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఇతర వ్యాపార సంస్థల పేర్లతో అసలు బ్రాండ్లకు దీటుగా నకిలీ బాటిళ్లను సృష్టిస్తున్నారు. వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లపై కనీసం తయారీ చిరునామా కూడా ఉండటం లేదు. కొన్నింటిపై ఇతర కంపెనీల అడ్రస్‌లు ముద్రిస్తున్నారు. నగరాల్లోనే కాకుండా మండలాల్లో సైతం రోడ్ల పక్కన రెండు స్టీల్‌ డ్రమ్ములకు మోటార్లు బిగించి, పైపుల ద్వారా ఆర్వో వాటర్‌ అంటూ అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

  • ‘మామూలు’ తనిఖీలు

  • జనాలకు ప్రాణాంతక నీటిని విక్రయిస్తున్నా.. ఆహార కల్తీ నియంత్రణాధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. అధికారులు తనిఖీలకు వెళ్లే సమయానికి దుకాణాలు, ప్లాంట్లు మూసివేస్తున్న అక్రమార్కులు.. మరుసటిరోజే తెరిచి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. నకిలీ లేబుళ్లపై ఉన్న అడ్రస్‌లకు అధికారులు వెళ్తే అక్కడ అసలు ప్లాంట్లే ఉండటం లేదు. దీనిపై ఫుడ్‌ సేఫ్టీ అధికారి కోట లక్ష్మీ స్పందిస్తూ... ‘‘ఎవరైనా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం’’ అని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా, నిబంధనలు పాటించని వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 06 , 2026 | 12:35 AM