రెండేళ్లలో ఆర్వోబీల నిర్మాణం పూర్తి
ABN , Publish Date - May 13 , 2026 | 11:34 PM
జిల్లాలో రికార్డు స్థాయిలో చేపడుతున్న ఆర్వోబీల నిర్మాణాన్ని వేగవంతంచేసి, రాబోయే రెండేళ్లలోగా పూర్తిచేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు.
- అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల అభివృద్ధికి చర్యలు
- సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
- కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం, మే 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రికార్డు స్థాయిలో చేపడుతున్న ఆర్వోబీల నిర్మాణాన్ని వేగవంతంచేసి, రాబోయే రెండేళ్లలోగా పూర్తిచేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. బుఽధవారం ఆయన ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి జిల్లా ఉన్నతాధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో కొన సాగుతున్న పలు కీలక ప్రాజెక్ట్‌ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో త్వరలో శ్రీకాకుళం కొత్త రూపు సంతరించుకోనుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
- జిల్లా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చి, సాఫీ ప్రయాణాన్ని చేరువ చేసేందుకు ఆర్వోబీల నిర్మాణం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న భూసమస్యల పరిష్కారానికి వెంటనే ఒక పూర్తిస్థాయి నోడల్ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు.
-చారిత్రక అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల సమగ్ర అభివృద్ధిపై మంత్రి ఈ సమీక్షలో ప్రత్యేకంగా చర్చించారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు, పరిశ్రమల ప్రోత్సాహానికి ఎంఎస్‌ఈ పార్కుల పనులను వేగవంతం చేయాలన్నారు. ఎయిర్‌ఫోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఎస్‌ఆర్ నిధులతో జిల్లా గ్రంథాలయం ఆధునీకరణతో పాటు, కొత్తగా 4 పబ్లిక్ పార్కుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
- జిల్లాలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడంలో భాగంగా రిమ్స్, జీజీహెచ్ అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా పాత్రునివలస వద్ద స్టేడియం నిర్మాణ పనులు, నగరంలోని కేఆర్ స్టేడియం ఆధునీకరణ పనుల పురోగతిపై ఆరా తీశారు.
- జిల్లాలో ఉన్న అపార వనరులను, సామర్థ్యాన్ని ప్రదర్శించి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. మౌలిక సదుపాయాల వృద్ధి, ఆర్థిక పురోగతి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నారు. ఈ దిశగా అధికారులంతా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
- ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లపై మంత్రి రామ్మోహన్‌నాయుడు అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వర్చువల్ సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మంత్రి ప్రైవేటు సెక్రటరీ శ్రీకేష్ లాత్కర్, సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.