Share News

చిక్కులు వీడుతాయ్‌

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:14 AM

Government measures to cancel household mapping జిల్లాలో ఎంతోమంది గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇటువంటివారికి ఊరట కలిగించేలా సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల ఒక శుభవార్త ప్రకటించారు. అమరావతిలోని కలెక్టర్ల సదస్సు వేదికగా.. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

చిక్కులు వీడుతాయ్‌

  • హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దుకు ప్రభుత్వ చర్యలు

  • కుటుంబం యూనిట్‌గా పథకాల వర్తింపు

  • అమల్లోకి వస్తే.. జిల్లాలో వేలాది మందికి లబ్ధి

  • మెళియాపుట్టి/ హిరమండలం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన పోలాకి వెంకటస్వామి మూడు నెలలు కిందట మృతి చెందాడు. ఆయన భార్య సర్వస్వతికి స్పౌజ్‌ కింద పింఛన్‌ మంజూరు చేయాల్సి ఉంది. కాగా.. వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీరు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో ఆ దంపతుల పేర్లను వేర్వేరు చోట్ల నమోదు చేయడంతో.. ప్రస్తుతం సరస్వతికి పింఛన్‌ మంజూరు కావడం లేదు.

  • జలగలింగుపురానికి చెందిన నడిమింటి సోమేశ్వరరావుకు ఆరు విద్యుత్‌ మీటర్లు ఉన్నట్టు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో చూపిస్తోంది. దీంతో తల్లికి వందనం పథకానికి దూరమయ్యాడు. తన సమస్య పరిష్కరించాలని అధికారులను పలుమార్లు వేడుకున్నాడు.

  • హిరమండలం మండల కేంద్రానికి చెందిన బొమ్మాళి నీలవేణి భర్త సిమ్మయ్య కొన్నాళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. నీలవేణి కూలి చేస్తూ ఇద్దరి పిల్లలను పోషిస్తోంది. ఈమె వితంతువు పింఛన్‌ కోసం దరఖాస్తు చేయగా.. తిరస్కరణకు గురైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో నీలవేణి తన తండ్రి కుటుంబంలో ఉన్నట్టు నమోదైంది. ఇప్పటికే తండ్రి పింఛన్‌ తీసుకుంటున్నాడని, ఒకే కుటుంబంలో ఇద్దరికి పింఛన్‌ రాదని సచివాలయ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆమె ఆవేదన చెందుతోంది.

  • జిల్లాలో ఇలా ఎంతోమంది గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇటువంటివారికి ఊరట కలిగించేలా సీఎం చంద్రబాబునాయుడు ఇటీవల ఒక శుభవార్త ప్రకటించారు. అమరావతిలోని కలెక్టర్ల సదస్సు వేదికగా.. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ‘భవిష్యత్‌లో కుటుంబమే యూనిట్‌గా అన్ని పథకాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు విడిపోవడం సరికాదు. హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు చేసి.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామ’ని సీఎం స్పష్టం చేశారు. దీంతో చాలామందికి న్యాయం జరగనుంది.

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల ద్వారా హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ ఇష్టానుసారంగా చేశారు. దీని ఆధారంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు మంజూరు చేస్తోంది. కాగా.. గతంలో హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ సక్రమంగా చేపట్టకపోవడంతో.. ప్రస్తుతం చాలామంది ప్రభుత్వ పథకాలు అందక పాట్లు పడుతున్నారు. కుటుంబం నుంచి విడిపోయి వేరుగా నివసిస్తున్నవారు, కొత్త దంపతులు రేషన్‌కార్డు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్డుల్లో పేర్ల తొలగింపు, పిల్లల పేర్లు చేర్చడం వంటివాటికి సాంకేతిక కారణాలు చూపుతూ సంక్షేమ పథకాలు మంజూరు చేయడం లేదు. అలాగే మరికొన్ని కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నట్టు, అధిక భూమి, నాలుగు చక్రాల వాహనాలు, ఎక్కువ సంఖ్యలో విద్యుత్‌ మీటర్లు ఉన్నట్టు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో తప్పుగా నమోదై ఉంది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన వ్యక్తులంతా.. తమకు అర్హత ఉన్నా.. ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 30వేల మంది వరకూ గత ప్రభుత్వ హయాంలో ‘హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌’లో చేసిన తప్పిదాలకు నష్టపోతున్నారు. ప్రస్తుతం కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. తమకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోతోందని వాపోతున్నారు. కాగా.. సీఎం చంద్రబాబు ప్రకటన మేరకు హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ రద్దు చేస్తే తమకు ఊరట లభించనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  • జాబితా పంపిస్తాం

  • హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌లో తప్పుల వల్ల ప్రస్తుతం చాలామంది పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాల మేరకు పంచాయతీల వారీగా జాబితా తయారు చేసి పంపిస్తాం.

  • నర్సింగ ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి

Updated Date - Sep 18 , 2026 | 12:14 AM