ప్రైవేటుతో.. పోటీ‘బడి’..
ABN , Publish Date - May 20 , 2026 | 12:20 AM
Increasing student enrollment in government schools ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రవేశాలు ఊపందుకున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల ప్రవేశాలు
జిల్లాలో ఇప్పటి వరకు 7,500 మంది చేరిక
సత్ఫలితాలు ఇస్తున్న అధికారుల చర్యలు
ఇంటింటా ప్రచారంతో అడ్మిషన్లు పెంపు
మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామం నుంచి గత ఏడాది సుమారు 20 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యాశాఖలో మార్పులు తీసుకురావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ ఏడాది గొప్పిలి నుంచి 25 మంది పిల్లలు స్థానిక మోడల్ స్కూల్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
మెళియాపుట్టి మండల పరిషత్ పాఠశాలలో ఈ ఏడాది ఒకటో తరగతిలో 32 మంది చిన్నారులు చేరేందుకు సిద్ధమవున్నారు. గతంలో ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు ఉండేవారు. ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు అయింది. విద్యాశాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ప్రవేశాలు పెరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
మెళియాపుట్టి, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రవేశాలు ఊపందుకున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. విద్యాశాఖ బలోపేతానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బోధనలో కొత్త ఒరవడితోపాటు ఇటీవల పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థులు సాఽధించిన మార్కుల ప్రభంజనం కూడా ప్రవేశాల పెరుగుదలకు కారణమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రస్తుతం 2,014 ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో 59,378 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది ఐదేళ్లు దాటిన విద్యార్థులు 21,290 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 11,710 మంది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు సుమారు 7,500 మంది ప్రవేశాలు పొందినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులను కూడా వేసవి సెలవుల ముగింపు నాటికి ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ప్రణాళికతో ముందుకు..
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేస్తోంది. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో పదో తరగతి ఫలితాల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఈ ఏడాది పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 90.60శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంలో నిలిచింది. 146 పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. దీంతో 500 మార్కులు దాటిన విద్యార్థులను నియోజకవర్గస్థాయిలో సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి గౌరవించారు. 590 మార్కులు దాటిన వారి ఫొటోలను పత్రికల్లో వేసి ప్రచారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు అడ్మిషన్ల కోసం ప్రత్యేకడ్రైవ్ సైతం నిర్వహిస్తున్నారు. ‘బడి పిలుస్తోంది’ పేరిట విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాల గురించి వివరించి ప్రవేశాలను ప్రోత్సహించారు. గ్రామాల్లో ర్యాలీలు చేపట్టి అవగాహన కల్పించారు. ప్రైవేట్ విద్యాసంస్థల మాదిరిగా ‘పది’లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఫొటోలను ఫ్లెక్సీలుగా వేయించి ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిండ్రులకు మరింత నమ్మకం కలిగింది. ఈక్రమంలో ప్రవేశాల సంఖ్య పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు
ప్రభుత్వ బడుల్లో అనేక వసతులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా భవనాలు, తరగతి గదులు ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, బెల్టులు, సాక్సులు, యూనిఫాం తదితర సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారం ఇస్తున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.13 వేలు చొప్పున నగదు జమ చేస్తుంది. గత ఏడాది ఈ పథకం కింద జిల్లాలో 2,54,408 మంది తల్లుల ఖాతాల్లో రూ.330.73 కోట్లు జమ చేసింది.
ఐదేళ్లు దాటిన వారిని గుర్తించాం
ఈ ఏడాది వేసవి సెలవులకు ముందే అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న ఐదేళ్ల వయసు దాటిన పిల్లల వివరాలు సేకరించాం. దీని ఆధారంగా వారిని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. గతంలో కంటే విద్యాశాఖలో మార్పులు రావడంతో ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయడం కూడా ఉపయోగకరంగా మారింది.
- మలరెడ్డి పద్మనాభం, మండల విద్యాశాఖ అధికారి -2, మెళియాపుట్టి