Share News

కమిషనర్‌ సార్‌.. ఇటు చూడరూ!

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:29 AM

శ్రీకాకుళం న గర పాలక సంస్థకు దశాబ్దంన్నర నుంచి ఎన్నికల లేవు. పాలకవర్గం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో నగరం అభివృద్ధి చెందడం లేదు.

కమిషనర్‌ సార్‌.. ఇటు చూడరూ!
నగరంలో ఎక్కడికక్కడే ఇలా గుంతల రోడ్లు

  • నగరపాలక సంస్థలో సమస్యల తిష్ఠ

  • పాతుకుపోయిన సిబ్బంది.. అవినీతి దందా

  • సబ్‌-లీజుల మాయాజాలం

  • చికెన్‌ వ్యర్థాల మాఫియా

  • వెలగని వీధి దీపాలు

  • గోడు వెళ్లబోసుకుంటున్న నగర ప్రజలు

శ్రీకాకుళం, జూలై 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం న గర పాలక సంస్థకు దశాబ్దంన్నర నుంచి ఎన్నికల లేవు. పాలకవర్గం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో నగరం అభివృద్ధి చెందడం లేదు. ప్రస్తుతం నగరపాల క సంస్థ ప్రత్యేకాధికారి (కలెక్టర్‌) పాలనలోనే కొనసా గుతోంది. ఈ నేపథ్యంలో కొత్త మునిసిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్‌ కుమార్‌కు నగర ప్రజలు ‘ఆంధ్రజ్యోతి’ ద్వారా తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు, పారిశుధ్య లోపం, అవినీతి వంటి అంశాలపై వెంటనే ఆయన దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఆదాయ మార్గాలకు గండి

మునిసిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందినా అధికమంది ఉద్యోగులు ఏళ్లతరబడి ఇక్కడి కార్యాలయంలో పాతుకుపోయారు. వీరు నగరపాలక సంస్థ ఆదాయ మార్గాలకు గండికొడుతూ, బయట వ్య క్తులకు లోపాయికారీగా సహకారం అందిస్తూ, గిట్టని అధికారులపై ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను తక్షణమే మార్పు చేయాల్సిఉంది. ఏళ్లతరబడి గా అద్దెలు, పన్నులు చెల్లించని వారు కోర్టుకు వెళ్లేలా కొంతమంది సిబ్బంది పరోక్షంగా సహకరిస్తున్నారు. దీంతో కోర్టు కేసుల కారణంగా ఆయా కట్టడాల నుంచి పన్నుల వసూలు ఆగిపోయింది. సాక్షాత్తు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పెద్దమార్కెట్‌లో మునిసిపల్‌ దుకాణాలకు ఎదురుగా రోడ్డు వరకూ ఓ దుకాణం ఉంది. ఆ ముందర తోపుడు బండ్లు ఉంటు న్నాయి. దీంతో మార్కెట్‌లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది

నిబంధనలకు నీళ్లొదలి..

నగరపాలక సంస్థ దుకాణాలను దక్కించుకున్నవా రు వాటిని సబ్‌-లీజులకు ఇస్తున్నారు. ప్రభుత్వానికి తక్కువ అద్దె చెల్లిస్తూ, సబ్‌-లీజుదారుల నుంచి అధిక అద్దె వసూలు చేస్తున్నారు. ఈ తంతు ఏళ్లతర బడి సాగుతోంది. లీజు లేదా సబ్‌-లీజు పొందిన వారు ఇష్టమొచ్చినట్లు మార్పులు చేస్తూ .. రెండు మూడు దుకాణాల మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించి, ఒకే దుకాణంగా మార్చుకుని సొంత భవంతిలా అనుభవిస్తున్నా ఎవరూ అడ్డుకోవడం లేదు. పై అంతస్తు వేసేదాకా సిబ్బంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. సగం పూర్త య్యాక నోటీసులు ఇవ్వడం, శ్లాబులకు కన్నాలు పెట్టి ఫొటోలు తీయడం, ఆ వెంటనే యజ మానులతో కుమ్మక్కై మళ్లీ కూలగొట్టిన ప్రాంతం లోనే భవనాలు నిర్మించుకోవడం ఇక్కడ బహి రంగ రహస్యం. నగరంలో భవనాలు, ఫంక్షన్‌ హాళ్లు, వ్యాపార సంస్థలకు ‘పార్కింగ్‌’ కేవలం ప్లాన్లలోనే ఉంటోంది. క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. జీటీ రోడ్డులోని అత్యంత విలువైన బంగారు నగల దుకాణాలకు సైతం పార్కింగ్‌ లేకపోవడంతో వాహనాలు రోడ్లపైనే నిలుపుదల చేస్తున్నారు.

చికెన్‌ వ్యర్థాలతో వ్యాపారం..

నగరంలో సుమారు వెయ్యికిపైగా చికెన్‌ దుకా ణాలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థాలను (కోడి చర్మం, పేగులు, వెంట్రుకలు) ప్రత్యేక వాహనాల్లో సేకరించి చేపల చెరువులకు అనధి కారికంగా తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. నగరపాలక సిబ్బందికి, ప్రైవేటు వ్యక్తులకు భారీ ఎత్తున నెలవారీగా డబ్బులు అందుతున్నాయి. ఏ ఒక్కనాడు సిబ్బంది దాడులు, తనిఖీలు చేసి మచ్చుకైనా ఆపిన దాఖలాలు లేవు. ఎక్కడపడితే అక్కడ ఉన్న ఖాళీ ప్రైవేటు స్థలాల్లో పిచ్చి మొక్క లు ఏపుగా పెరిగిపోయాయి. ఏకధాటిగా వర్షం కురిస్తే ఆ ప్రాంతాలు చెరువుల్లా మారు తున్నా యి. ఆ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వ డం, శుభ్రం చేయించడం, పన్నులు వసూలు చేయడం లాంటి పనులను సిబ్బంది పట్టించు కోవడం లేదు.

పడకేసిన పారిశుధ్యం

నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ లేదు. రోడ్ల విస్తరణలో భాగంగా కాలువల నిర్మాణం చేపడుతున్నా వాటి నిండా మురుగు, వర్షపునీరు నిలిచిపోయి దుర్గంధం, దోమల మోత ఎక్కువగా ఉంటోంది. మురుగునీటి శుద్ధివ్యవస్థ (ఎస్టీపీ) పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయా యి. వాటిని పూర్తిచేయాలన్న శ్రద్ధ అధికారులు, ప్రజాప్రతినిధులకు లేదు. దీంతో మురుగునీరు నేరుగా నాగావళి నదిలో కలుస్తోంది. మున్సిపల్‌ సిబ్బంది ఉదయాన్నే వచ్చి ప్రతి ఇంటినుంచి చెత్తను తీసుకెళ్లేవారు. ఇప్పుడు చాలా రోజులుగా ఉదయం 9 గంటలు దాటాకనే వస్తున్నారు. చెత్త సేకరణ ద్వారా సంపద సృష్టించారంటే అదీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

కుక్కలు, పశువుల స్వైరవిహారం..

నగరంలో వీధి కుక్కలు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి వేళ కుక్కలు బైక్‌ల వెంటపడుతూ పలువురిపై దాడి చేస్తున్నాయి. వాటికి నిరంతరం సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నా కుక్కల సంఖ్య ఎందుకు పెరుగుతుందో అర్థంకావడం లేదు. కొందరు తమ ఆవులను రోడ్లపైనే వదిలేస్తున్నారు. దీంతో అవి ప్లాస్టిక్‌ వ్యర్థాలు తింటూ, రాత్రి వేళల్లో రోడ్లపైనే గుంపులుగా పడుకుంటున్నాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పలు డివిజన్లలో వీధి దీపాలు వెలగక చీకటి రాజ్యమేలుతోంది. వీధి దీపాల నిర్వహణను కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

అస్తవ్యస్తంగా డివిజన్ల విభజన...

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన డివిజన్ల విభజన అధికశాతం అస్తవ్యస్తంగా ఉంది. దీనిపై కొందరు మరలా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నారు. అప్పట్లో జరిగిన విభజన ప్రక్రియను మరలా పరిశీలించి తప్పులు సరిచేయాలని ప్రస్తుత ప్రజాప్రతినిదులు డిమాండ్‌ చేస్తున్నారు.

తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు

ఏళ్ల తరబడిగా ఒకే సీటులో పాతుకుపోయి, అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిని వెంటనే గుర్తించి మార్పు చేయాలి.

పెద్దమార్కెట్‌ ఆక్రమణలను, దుకాణాల సబ్‌-లీజుల వ్యవహారాన్ని అడ్డుకోవాలి.

చికెన్‌ దుకాణాల వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్‌ చేసి, ముడుపులు తీసుకుంటున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

సెల్లార్‌ పార్కింగ్‌ లేని దుకాణాలు, అక్రమ భవనాలపై చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి పన్నులు వసూలు చేసి వాటిని శుభ్రం చేయించాలి.

వీధి కుక్కలు, రోడ్లపై సంచరించే ఆవుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

Updated Date - Jul 20 , 2026 | 12:29 AM