బీసీల సామాజిక స్థితిగతులపై కమిషన్ ఆరా
ABN , Publish Date - May 02 , 2026 | 12:21 AM
Public inquiry on reservations రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ చేపట్టింది.
కలెక్టరేట్‌లో రిజర్వేషన్లపై బహిరంగ విచారణ
చైర్మన్‌కు వినతులు సమర్పించిన వివిధ కుల సంఘాలు
నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం: రాజీవ్ రంజన్ మిశ్రా
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల(బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ చేపట్టింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. వివిధ కులసంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీపీవో నుంచి గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, వాటిల్లో బీసీలకు కేటాయించిన సీట్లు, గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య తదితర నివేదికలను అందజేయాలని కోరారు. జడ్పీ సీఈవో, మున్సిపల్ కమిషనర్ల ను బీసీ అభ్యర్థుల గెలుపు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శయన సంఘం నాయకులు దండాశి జ్యోతి భాస్కర్, ఉత్తరాంధ్ర యాదవ సంఘ ప్రతినిధులు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు, నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు కుప్పిలి వెంకటరావు, గోరంటి.శ్రీను తదితరులు చైౖర్మన్‌ను కలిసి వినతులను సమర్పించారు. సమస్యలను వివరించారు. వినతులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరామన్, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, బీసీ సంక్షేమాధికారి వినాయకం, పీవీవీ ప్రసాదరావు, డీపీవో భారతీ సౌజన్య, కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.