నామినేషన్లకు శ్రీకారం
ABN , Publish Date - Oct 17 , 2026 | 12:50 AM
12 nominations on the first day జిల్లాలో మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో చైర్పర్సన్, కౌన్సిలర్లకు సంబంధించి మొత్తం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో తొలిరోజు 12 దాఖలు
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నిబంధనలు పక్కాగా అమలుచేయాలని ఆదేశం
పలాస/ ఇచ్ఛాపురం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మునిసిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీల్లో చైర్పర్సన్, కౌన్సిలర్లకు సంబంధించి మొత్తం 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పర్యవేక్షించారు.
పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీలో తొలిరోజు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, కమిషనర్ ఇ.శ్రీనివాసులు తెలిపారు. చైర్పర్సన్ అభ్యర్థులుగా దువ్వాడ శ్రీజ, లక్ష్మిప్రధాన్, సాయిభవానిప్రధాన్, కౌన్సిలర్ అభ్యర్థులుగా కొత్త రాజేశ్వరి, దువ్వాడ శ్రీకాంత్ నామినేషన్లు వేశారు. శనివారం వైసీపీ కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడానికి సిద్ధం కావడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో తొలిరోజు ఇద్దరు చైర్పర్సన్ అభ్యర్థులు, ఐదుగురు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చైర్పర్సన్కు సంబంధించి వైసీపీ తరపున పిలక రాజ్యలక్ష్మి, ఇండిపెండెంట్గా బచ్చు మంగమ్మ నామినేషన్లు వేశారు. కౌన్సిలర్ అభ్యర్థులుగా 4వ వార్డు నుంచి మట్ట సోని(వైసీపీ), 12వ వార్డు నుంచి కె.రాజేశ్వరి(వైసీపీ), 15వ వార్డు నుంచి రెయ్యి సత్యవతి(టీడీపీ), 28వ వార్డు నుంచి గువ్వాడ ప్రదీప్కుమార్(వైసీపీ), గువ్వాడ సౌజన్య(వైసీపీ) నామినేషన్లు దాఖలు చేశారు.
నిబంధనలు పాటించాల్సిందే
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్లను స్వీకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. వంద మీటర్ల దూరంలో బారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రంలో ఎన్నికల అధికారులు, సిబ్బంది తప్ప మిగిలిన వారు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కమిషనర్లకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో అప్పలరాజు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.రమేష్, ప్రత్యేకాధికారి వేణుగోపాలరావు, సిబ్బంది పాల్గొన్నారు.