Share News

రావడం.. వారిష్టం!

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:10 AM

Lack of Punctuality at Ambedkar University ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో కొంతమంది అధ్యాపకులు, సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది. వారు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

రావడం.. వారిష్టం!
అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిపాలనా కార్యాలయం

  • అంబేడ్కర్‌ యూనివర్సిటీలో కానరాని సమయపాలన

  • కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

  • గాడి తప్పుతున్న క్లాస్‌వర్క్‌

  • ఎచ్చెర్ల రూరల్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో కొంతమంది అధ్యాపకులు, సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది. వారు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా రోజులు తరువాత బుధవారం ఉన్నతాధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించటం, సమయపాలన పాటించని సబ్జెక్టు కాంట్రాక్టు ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేయటం చర్చనీయాంశంగా మారింది.

  • అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో 17 పీజీ కోర్సులు, ఎంబీఏ, ఐటెప్‌, ఇంజినీరింగ్‌, ప్రత్యేక బీఈడీ కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్‌, కామర్స్‌, లా క్లాస్‌వర్క్‌ ఉదయం 8 గంటల నుంచి 2, సైన్స్‌ ఇంజనీరింగ్‌ క్లాస్‌వర్క్‌ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి. అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి నాన్‌టీచింగ్‌ ఉదయం 10 నుంచి 5 గంటలు, అకడమిక్‌కు సంబంధించి నాన్‌టీచింగ్‌ ఉదయం 8 నుంచి 4 గంటలు వరకు పనిచేయాలి. వసతిగృహానికి సంబంధించి మూడుషిఫ్ట్‌ల్లో పనిచేస్తారు. విశ్వవిద్యాలయంలో బయోమెట్రిక్‌ లేదా ముఖహాజరు విధానం మేరకు వేతనాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ మాన్యువల్‌ హాజరు పద్ధతిలో వేతనం అందజేస్తున్నారు. దీంతో కొంతమంది విధులకు హాజరుకాకుండానే వేతనాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • పర్యవేక్షణ కరువు...

  • సమయపాలన రిజిస్టర్లను ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్స్‌ పరిశీలించాలి. నిబంధనల మేరకు హాజరైన దినాలకు వేతనం చెల్లించాలి. ఇక్కడ పోర్టుపోలియో పదవుల్లో ఉన్న రెగ్యులర్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్న ఉద్యోగులు కచ్చితంగా పనిచేస్తున్న సంస్థకు నాలుగు కిలోమీటర్లలో ఉండాలి. ఈ నిబంధనలు అమలుకావటం లేదు. ఉన్నతాధికారులు నచ్చిన సమయంలో వచ్చి.. వెళ్లిపోతున్నారు. కనీసం అధ్యాపకులు, సిబ్బంది హాజరు పరిశీలించడం లేదు. బయోమెట్రిక్‌, ముఖహాజరు అమలు చేయడం లేదు. దీంతో అధ్యాపకులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

  • ఇద్దరు నాన్‌టీచింగ్‌ సిబ్బంది.. ఒక రాజకీయ నాయకుని ఇంట్లో పనిచేస్తూ.. విశ్వవిద్యాలయంలో వేతనం తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

  • విశాఖపట్నం నుంచి ఇంజినీరింగ్‌ కాలేజ్‌కు వస్తున్న ఓ ఎడ్జెంట్‌ ఫ్యాకల్టీ వారంలో రెండు రోజులు వచ్చి ఉన్న వర్కింగ్‌ దినాలు సంతకం చేసి వేతనం తీసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది.

  • గత వీసీ పాలనలో తన కోటరీకి ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం అమలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అదే విధానం ఇప్పుడూ కొనసాగుతుందన్న ప్రచారం ఉంది.

  • యూనివర్సిటీలో న్యాయవిభాగాన్ని బుధవారం వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్‌లో అధ్యాపకుడు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డిపార్ట్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కూడా లేకపోవటాన్ని గుర్తించారు. ఇద్దరూ సమయపాలన పాటించకపోవటంతో నెల రోజులుపాటు వారిని సస్పెండ్‌ చేయాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్యను ఆదేశించారు. ఇదే మాదిరి వీసీ, ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. యూనివర్సిటీలో విద్యాప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • ఈ విషయమై రిజిస్ర్టార్‌ బిడ్డిక అడ్డయ్య వద్ద ప్రస్తావించగా.. ‘పక్కాగా క్లాస్‌వర్క్‌ జరుగుతోంది. క్లాస్‌వర్క్‌, పరిపాలన కార్యాలయాలను తనిఖీలు చేస్తున్నాం. కచ్చితంగా నిబంధనలు అమలు చేస్తున్నామ’ని తెలిపారు.

Updated Date - Oct 02 , 2026 | 12:10 AM