Share News

ఒడిశా నుంచి వచ్చేస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:58 PM

Transportation of prohibited goods from Odisha జిల్లాకు ఒడిశా నుంచి నిషేధిత వస్తువులు ఖైనీ, గుట్కాతో పాటు సారా యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. ఇక గంజాయికి అడ్డుకట్ట పడడం లేదు. పోలీసులు, ఎక్సైజ్‌ తనిఖీ కేంద్రాలు లేకపోవడంతో అక్రమార్కులు నిషేధిత వస్తువులను యథేచ్ఛగా జిల్లాకు తెచ్చి విక్రయిస్తున్నారు.

ఒడిశా నుంచి వచ్చేస్తున్నాయ్‌!
ఇచ్ఛాపురంలో తనిఖీలు లేని చీకటి గేట్‌

  • పొరుగు రాష్ట్రం నుంచి నిషేధిత వస్తువుల రవాణా

  • సరిహద్దు మండలాల్లోని 20 దారులు మీదుగా..

  • తనిఖీ కేంద్రాల ఎత్తివేతతో అక్రమార్కుల ఇష్టారాజ్యం

  • ఇచ్ఛాపురం, జనవరి 2(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ఒడిశా నుంచి నిషేధిత వస్తువులు ఖైనీ, గుట్కాతో పాటు సారా యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. ఇక గంజాయికి అడ్డుకట్ట పడడం లేదు. పోలీసులు, ఎక్సైజ్‌ తనిఖీ కేంద్రాలు లేకపోవడంతో అక్రమార్కులు నిషేధిత వస్తువులను యథేచ్ఛగా జిల్లాకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి పాతపట్నం వరకూ ఒడిశాతో జిల్లా సరిహద్దు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వాహనాల రాకపోకల పర్యవేక్షణకు కేవలం మూడు తనిఖీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వీటికి సమాచారం అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు.

  • ఒడిశా నుంచి జిల్లా మీదుగా గంజాయి, సారా, పశువులు, కలప, ద్విచక్ర వాహనాలు, నకిలీ బిల్లుతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జిల్లాలో వినియోగించడంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నారు. ఒడిశా నుంచి జిల్లాలో ప్రవేశించేందుకు ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, మందస, పలాస, మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు మండలాల పరిధిలోని 20కు పైగా మార్గాలున్నాయి. ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురం, పాతపట్నంలో మాత్రమే పోలీస్‌ తనిఖీ కేంద్రాలున్నాయి. మరొకటి రణస్థలం మండలం పైడిభీమవరంలో ఉంది. ఇక ఎక్సైజ్‌ తనిఖీ కేంద్రంగా మెళియాపుట్టి కొనసాగుతోంది. మిగిలిన మార్గాల్లో వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా ఎటువంటి తనిఖీలు లేవు. వీటి ద్వారా కోట్లాది రూపాయల నిషేధిత వస్తువుల రవాణా సాగిపోతోంది. గతంలో పోలీస్‌ చెక్‌పోస్టులు జిల్లావ్యాప్తంగా 20 పైగా ఉండేవి. అక్కడ మాజీ సైనికులను నియమించి తనిఖీలు చేపట్టేవారు. అప్పట్లో ఒడిశా రూట్లో వేల కిలోల గంజాయి, పదుల సంఖ్యలో వాహనాలు పట్టుబడ్డాయి. కానీ ఎందుకో ఆ తనిఖీ కేంద్రాలను ఎత్తేశారు.

  • ఎక్కడెక్కడ అంటే..

  • ప్రధానంగా ఇచ్ఛాపురం మండలం టి.బరంపురం, పెద్దలక్ష్మీపురం, కొళిగాం, ముచ్చింద్రా మార్గాల గుండా ఒడిశా నుంచి నిషేధిత వస్తువులు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. కంచిలి మండలానికి సంబంధించి కేశుపురం, బైరిపురం.. సోంపేటలో పిరియాసాయి, కొంగాపూర్‌ నుంచి బాతుపురం, ఎంజీ పురం, పొత్తంగి మీదుగా వస్తున్నాయి. మందస మండలానికి సంబంధించి తుంబ కొండ నుంచి అంబటికంబరం, సింగుపురం మీదుగా, మెళియాపుట్టిలో వసుంధర, గొప్పిలి, పట్టుపురం మీదుగా రవాణా సాగుతున్నాయి. పాతపట్నంలో ఎస్‌ఎస్‌ కవిటి, రుగడ, కురిగాం మార్గాల్లో.. కొత్తూరులో హడ్డుబంగి మీదుగా మాతల, పాతపట్నం వైపు మార్గాల్లో నిషేధిత వస్తువులు తరలిస్తున్నారు. గతంలో ఈ మార్గాల్లో పోలీస్‌ చెక్‌పోస్టులు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని తొలగించడంతో నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఇప్పటికైనా పోలీస్‌ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • నిఘా పెంచాం..

  • ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే నిషేధిత వస్తువులపై నిఘా పెంచాం. ఆయా మార్గాల్లో ఎప్పటికప్పడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. అంతర్‌ రాష్ట్ర మార్గాల్లో పోలీస్‌ చెక్‌పోస్టులు తెరిచే ఆలోచన ఉంది.

    - మీసాల చిన్నమనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

Updated Date - Jan 02 , 2026 | 11:58 PM