రండి.. ఓటేద్దురు!
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:12 AM
MPT and ZPTC candidates make phone calls to migrant voters ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఓట్ల వేటే లక్ష్యంగా గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లను ఎన్నికలకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వలస ఓటర్లకు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఫోన్లు
గ్రామాల్లోనూ ముమ్మరంగా ప్రచారం
నరసన్నపేట/ మెళియాపుట్టి/ ఎచ్చెర్ల రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఓట్ల వేటే లక్ష్యంగా గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లను ఎన్నికలకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 30 జడ్పీటీసీ స్థానాలకుగానూ 95 మంది బరిలో నిలిచారు. అలాగే 542 ఎంపీటీసీ స్థానాలకుగానూ ఇప్పటికే 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 523 ఎంపీటీసీ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 1,222 మంది బరిలో నిలిచారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు వలస ఓటర్లపై దృష్టి సారించారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉద్యోగులు, చదువు నిమిత్తం విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాదు వంటి ప్రాంతాల్లో కొందరు ఉంటున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారి బంధువుల ద్వారా వలస ఓటర్ల ఫోన్ నెంబర్లను అభ్యర్థులు సేకరిస్తున్నారు. వలస ఓటర్లకు ఫోన్లు చేస్తూ.. రండయ్యా.. రండమ్మా.. ఓటేద్దురు అంటూ పిలుస్తున్నారు. తాము దూరప్రాంతాల్లో ఉన్నామని రావడం కష్టమని కొందరు ఓటర్లు చెబుతున్నారు. కాగా.. ప్రయాణ ఖర్చులు తాము చూసుకుంటామని.. ఎలా అయినా సరే వచ్చి ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. కొంతమంది ఆన్లైన్ లావాదేవీల ద్వారా వలస ఓటర్లకు నగదు పంపించి ఎన్నికలకు రావాలని చెబుతున్నారు.
ఎచ్చెర్ల మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అజ్జరాం, కుప్పిలి, సంతసీతారంపురం, పూడివలస, డి.మత్స్యలేశం. బడివానిపేట, బుడగుట్లపాలేం వంటి గ్రామా ల నుంచి వలస ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి మత్స్యకారులు సూరత్, చెన్నై వంటి ప్రాంతాలకు ఉపాధి కోసం తరలివెళ్లారు. అలాగే మరికొందరు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై వంటి ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా జీవనోపాధి పొందుతున్నారు. వీరిని ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలకు రప్పించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు కృషి చేస్తున్నారు. రవాణాచార్జీలు, ఇతర ఖర్చులు సమకూర్చుతున్నారు. వలస ఓటర్లకు మద్యం, భోజనం వంటివి కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఎంపీపీ రేసులో ఉన్న అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహాలతోపాటు ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు.
నేటితో ప్రచారానికి తెర : కలెక్టర్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెర పడనుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ నెల 5న ఉదయం 7 గంటల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీనికి 48 గంటల ముందే.. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తుంది. మైకులు, లౌడ్స్పీకర్లు, ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు సామాజిక మాధ్యమాల్లో ఓటర్లను ప్రలోభపెట్టే సందేశాలు, ప్రకటనలపై సైబర్ విభాగం నిఘా పెట్టింది. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం అమల్లో ఉంటుంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ నేతలు, అభ్యర్థులు, ఓటర్లు సహకరించాల’ని కలెక్టర్ కోరారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.