చుట్టపుచూపుగా వచ్చి.. ఆభరణాలు కాజేసి..!
ABN , Publish Date - May 05 , 2026 | 12:09 AM
Woman arrested in theft cases ఆ మహిళ తెలిసిన వారింటికి చుట్టపుచూపుగా వెళ్లేది. వారితో మాటలు కలిపి.. ఇంట్లో బంగారం ఆభరణాలపై కన్నేసేది. వారు ఇంట్లో లేని సమయంలో చోరీలకు పాల్పడుతుండేది. చివరకు రెండుచోట్ల జరిగిన చోరీ కేసుల్లో 22.4 తులాల బంగారు ఆభరణాలతో పోలీసులకు చిక్కింది.
అవలంగి, బైదలాపురం చోరీ కేసుల్లో మహిళ అరెస్టు
22.4 తులాల బంగారం రికవరీ
నరసన్నపేట, మే 4(ఆంధ్రజ్యోతి): ఆ మహిళ తెలిసిన వారింటికి చుట్టపుచూపుగా వెళ్లేది. వారితో మాటలు కలిపి.. ఇంట్లో బంగారం ఆభరణాలపై కన్నేసేది. వారు ఇంట్లో లేని సమయంలో చోరీలకు పాల్పడుతుండేది. చివరకు రెండుచోట్ల జరిగిన చోరీ కేసుల్లో 22.4 తులాల బంగారు ఆభరణాలతో పోలీసులకు చిక్కింది. ఇందుకు సంబంధించి సోమవారం నరసన్నపేటలోని పోలీసుస్టేషన్‌లో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ‘సారవకోట మండలం అవలంగి, బైదలాపురంలో ఇటీవల జరిగిన చోరీ కేసుల్లో ప్రధాన నిందితురాలు ముద్దాడ లక్ష్మీని అరెస్టు చేశాం. అవలంగికి చెందిన ముద్దాడ సురేష్, లక్ష్మీ దంపతులు కొన్నాళ్లుగా విశాఖపట్నంలో గృహ నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీ మార్చి 21న అవలంగి వచ్చింది. గ్రామంలో బంధువు ముద్దాడ గౌరినాయుడు ఇంటికి వెళ్లింది. ఆ కుటుంబ సభ్యులతో మాటామంతీ కలిపింది. ఎవరూలేని సమయంలో గౌరినాయుడు ఇంట్లోకి చొరబడి 13 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. అలాగే గత నెల 21న లక్ష్మీ.. కన్నవారి గ్రామమైన బైదలాపురం వెళ్లింది. అక్కడ యాళ్ల రాము ఇంట్లో రాత్రివేళ చొరబడింది. నిద్రిస్తున్న రాము భార్య శకుంతుల, కుమార్తె పావని మెడలో 5 తులాల రెండు పుస్తెలుతాళ్లను దొంగించింది. మళ్లీ అవలంగి చేరుకుంది. గత నెల 26న గ్రామంలోని గుండ బోడేసు భార్య లక్ష్మీనారాయణ మెడలో రెండున్నర తులాల పుస్తెలతాడును దొంగిలించింది. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేశారు. ఈ రెండు గ్రామాల్లో చోరీలకు పాల్పడిన తీరును పరిశీలించి.. ఒక్క వ్యక్తియేనని నిర్ధారణకు వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు గ్రామాలతో సంబంధం ఉన్న ముద్దాడ లక్ష్మీపై అనుమానంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈక్రమంలో చోరీకి పాల్పడిన బంగారం ఆభరణాలు విక్రయించేందుకు సోమవారం అవలంగి నుంచి బుడితి జంక్షన్ వద్ద పోలీసులు పరిశీలించి ఆరా తీశారు. చోరీల బండారం బయటపడింది. ఆమె నుంచి రూ.32 లక్షల విలువైన 22.49 తులాల బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేశాం. లక్ష్మీ విశాఖపట్నంలో ఎంవీపీ పోలీసుస్టేషన్ పరిధిలో కూడా చోరీకి పాల్పడింద’ని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. కేసు చేధించిన సీఐ శ్రీనివాసరావును, ఎస్‌ఐలు అనిల్, ఆశోక్‌బాబు, రంజిత్, గణేష్‌తోపాటు హెచ్‌సీ కె.భాస్కరరావు, పీసీ జి.సత్యనారాయణ, దాలినాయుడును అభినందించారు.