ఆటోను ఢీకొని... అదుపు తప్పి!
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:20 AM
పద్మనాభపురం గ్రామం వద్ద పాత జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో డొక్కరి దివాకర్(26) అనే యువకుడు మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరో ఇద్దరికి గాయాలు
పలాస/వజ్రపుకొత్తూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పద్మనాభపురం గ్రామం వద్ద పాత జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో డొక్కరి దివాకర్(26) అనే యువకుడు మృతి చెందాడు. పిల్లల బాలకృష్ణ, దట్టి గోవిందరావు అనే ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు...పోలీసుల కథనం మేరకు వివరాలివీ.. గోవిందరావు, బాలకృష్ణ, దివాకర్‌లు బుల్లెట్ వాహనంపై కాశీబుగ్గ వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వెళ్తున్న ఆటోను ఢీకొనడంతో అదుపుతప్పి గ్రామం పేరు తెలిపే బోర్డును ఢీకొన్నారు. వాహనంపై కూర్చున్న దివాకర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా... మిగిలిన ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. మృతుడితో పాటు గాయాలకు గురైన వారందరూ వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన వారు. విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దుబాయ్ వెళ్లాలనే ప్రయత్నం...
ప్రమాదంలో మృతిచెందిన డొక్కరి దివాకర్ తల్లిదండ్రులు హైమావతి, సూర్యానారాయణలు కూలి పనులు చేసి జీవిస్తున్నారు. కుమార్తెకు ఇది వరకే వివాహం చేశారు. దివాకర్ కాశీబుగ్గలోని ఓ సెల్‌ఫోన్ షోరూంలో పని చేసేవాడని గ్రామస్థులు చెప్పారు. ఆధాయం సరిపడకపోవడంతో దుబాయ్ వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదంలో గాయపడిన బాలకృష్న, దట్టి గోవిందరావుల కుటుంబాలకు కూడా కూలీ పనులే ఆధారమని గ్రామస్థులు చెప్పారు. ఈ ముగ్గురు స్నేహితులు ఎక్కడికైనా కలిసే వెళతారని తెలిపారు. మంగళవారం వారు కోసంగిపురం వైపు ఎందుకు వెళ్లారో తెలియడం లేదని స్థానికులు చెప్పారు.