కళాశాల దూరమై.. చదువు భారమై
ABN , Publish Date - May 18 , 2026 | 11:59 PM
If you want to pursue a degree, you have to go to Srikakulam జూనియర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. రణస్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణం.. కార్యరూపం దాల్చడం లేదు.
డిగ్రీ చదవాలంటే శ్రీకాకుళం వెళ్లాల్సిందే
రణస్థలానికి మంజూరుకాని డిగ్రీ కాలేజీ
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
మూడున్నర దశాబ్దాలుగా ఎదురుచూపులు
రణస్థలం/ కంచిలి/ మెళియాపుట్టి, మే 18(ఆంధ్రజ్యోతి): జూనియర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులో లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. రణస్థలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణం.. కార్యరూపం దాల్చడం లేదు. జనవరిలో కోటబొమ్మాళికి డిగ్రీ కాలేజీ మంజూరైంది. కానీ రణస్థలానికి మాత్రం మోక్షం కలగడం లేదు. 1990 నుంచి డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. రణస్థలంలో ఒక ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కేజీబీవీతోపాటు ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా 2 వేల మంది విద్యార్థులు ఇంటర్ నుంచి రిలీవ్ అవుతున్నారు. కాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో వ్యయప్రయాసలకు ఓర్చుతున్నారు. డిగ్రీ చదవాలంటే 35 కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం నగరానికి, లేదంటే 45 కిలోమీటర్ల విజయనగరం నగరానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఇంటర్‌తోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటైన పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా డిగ్రీ కాలేజీ భవనాల నిర్మాణానికి ముందుకొచ్చాయి. కానీ ప్రభుత్వం నుంచి కాలేజీ మంజూరు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ చెందుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా ఎదురుచూపులు తప్పడం లేదని వాపోతున్నారు.
పరిశీలనతోనే సరి..
రణస్థలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తే స్థానికులతోపాటు లావేరు, విజయనగరం జిల్లా పరిధిలోని చీపురుపల్లి, పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కాగా, రణస్థలంలో ప్రభుత్వ డిగ్రీకాలేజీ ఏర్పాటుకు ఆర్జేడీ నేతృత్వంలోని అధికారుల బృందం పలుమార్లు పరిశీలించింది. గతంలోనూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కళాశాలల తరగతుల నిర్వహణకు వసతుల వెసులబాటు, భవనాల నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేశారు. కళాశాల మంజూరైతే స్థానిక పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులతో భవనాల నిర్మాణం సైతం పూర్తిచేయవచ్చు. కానీ నిధుల మంజూరుకు సంబంధించి ఆర్థికశాఖ అభ్యంతరాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే స్థానిక ఎమ్మెలే నడుకుదుటి ఈశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి నారా లోకేశ్‌కు ఇక్కడ పరిస్థితిని వివరించారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందట శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ, ఎమ్మెల్యే ఈశ్వరరావు కొండములగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫీజుబులిటీ సర్వేను రెవెన్యూ సిబ్బంది చేపట్టారు. అయినా సరే డిగ్రీ కాలేజీ మంజూరు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒరియా విద్యార్థులకు తప్పని కష్టాలు
కంచిలి మండలంలోని 31 పంచాయ తీల్లో 25 గ్రామాల ప్రజలు తెలుగుతోపాటు ఒరియా మాతృభాషగా కలిగి ఉన్నారు. వీరి పిల్లలు ఒరియా మాధ్యమంలోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. పదో తరగతి వరకు ఇబ్బందులు లేకపోయి న్నా, ఇంటర్మీడియట్ చదివేందుకు మాత్రం కంచిలి మండలం శివారు గ్రామాల ప్రజలు కష్టాలు పడాల్సిందే. ఒరియా మాధ్యమం కావాలంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచిలి ప్రభుత్వ కళాశాలలోనే చదవాల్సిన పరిస్థితి. ఈ మండలం ఎం.ఎస్.పల్లిలోని మోడల్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ఉండగా, ఒరియా మాధ్యమంలో చదివే వారంతా తప్పనిసరిగా కంచిలి కానీ, లేదా ఇచ్ఛాపురం కానీ వెళ్లాల్సి వస్తోంది. కంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మండలానికి చెందిన విద్యార్థులతోపాటు కవిటి మండలంలోని సహలాలపుట్టుగ, పెద్ద మెళియాపుట్టుగ, చిన్న మెళియాపుట్టుగ, సామంతపుట్టు తదితర గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. వీరంతా ప్రతిరోజూ సుమారు 15 కిలోమీటర్ల దూరం నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ సర్వీసులు పూర్తిస్థాయిలో లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను అంతదూరం పంపించేందుకు ఇష్టపడడం లేదు. దీంతో కొంతమంది విద్యార్థినులు ప్రతిభ ఉన్నా.. చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎం.ఎస్.పల్లిలో జూనియర్ కళాశాలను ఒరియా మాధ్యమంతో ఏర్పాటు చేస్తే సుమారు 12 పంచాయతీలకు చెందిన గిరిజన విద్యార్థులకు ఎంతోమేలు జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
మెళియాపుట్టి మండలంలో..
మెళియాపుట్టి మండలంలోని భరణికోట, కరజాడ, బాణాపురం, పరశురాంపురం, కేరాశింగి, గొట్టిపల్లి, అంపురం, బందపల్లి, దీనబంధుపురం, మారడికోట తదితర పంచాయతీలకు జూనియర్ కళాశాలలు అందుబాటులో లేవు. దీంతో చాలామంది గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. పదో తరగతి వరకు చదివి ఇంటిలో ఉండిపోతున్నారు. మండల కేంద్రం మెళియాపుట్టిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నా గిరిజన గ్రామాల నుంచి ప్రతిరోజూ ఇక్కడికి రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో చాలామంది విద్యార్థినులు చదువు మానేస్తున్నారు. డిగ్రీ కళాశాల కూడా లేకపోవడంతో టెక్కలి, పాతపట్నం, పలాస ప్రాంతాలకు వెళ్లి చదువులు సాగిస్తున్నారు. గిరిజన బాలికల కోసం పెద్దమడిలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.