Share News

పొలం పనులకు వెళ్లి.. కుప్పకూలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:54 PM

Woman dies after being struck by lightning రోజూ మాదిరి పొలం పనులకు వెళ్లిన.. ఓ మహిళ పిడుగుపాటుతో కుప్పకూలి మృతి చెందింది. కోటబొమ్మాళి మండలం చిట్టేవలస పంచాయతీ చవితిపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పొలం పనులకు వెళ్లి.. కుప్పకూలి
సుజాత (ఫైల్‌)

పిడుగుపాటుతో మహిళ మృతి

కోటబొమ్మాళి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రోజూ మాదిరి పొలం పనులకు వెళ్లిన.. ఓ మహిళ పిడుగుపాటుతో కుప్పకూలి మృతి చెందింది. కోటబొమ్మాళి మండలం చిట్టేవలస పంచాయతీ చవితిపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చవితిపేటకు చెందిన సంపతిరావు సుజాత(40) సోమవారం మధ్యాహ్నం పొలం పనికి వెళ్ళి వరివెదలో కలుపు తీస్తోంది. ఆ సమయంలో స్వల్ప వర్షంతోపాటు ఉరుములు.. మెరుపులతో పిడుగు పడింది. దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది. పక్క పొలంలో పనులు చేస్తున్న గ్రామస్థులు పరుగున వచ్చి చూసేసరికి సుజాత విగతజీవిగా కనిపించింది. సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సామాజిక ఆస్పత్రికి తరలించారు.

సుజాతకు భర్త సింహాచలం, కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె త్రివేణి ఉన్నారు. లక్ష్మణరావు చార్టెడ్‌ అకౌంట్‌ (సీఏ) విద్యనభ్యసిస్తున్నాడు. త్రివేణి డిగ్రీ చదువుతోంది. భార్యభర్తలు కూలి చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పిడుగుపడి సుజాత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Aug 03 , 2026 | 11:54 PM