కొబ్బరి పీచు పరిశ్రమ దివాలా
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:10 AM
ఒకప్పుడు కంచిలి కొబ్బరి పీచు పరిశ్రమకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉండేది.
ఒక్కొక్కటిగా మూతపడుతున్న వైనం
గతంలో 14 ఉంటే ఇప్పుడు నాలుగే మిగిలాయి
గోడౌన్‌లు, స్ర్కాప్ దుకాణాలుగా భవనాలు
సగానికి పడిపడిపోయిన పీచు ధరలు
పనిలేక వలసపోతున్న కార్మికులు
కంచిలి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు కంచిలి కొబ్బరి పీచు పరిశ్రమకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉండేది. 40 ఏళ్ల కిందట ఇక్కడ పదుల సంఖ్యలో పీచు పరిశ్రమలు నడిచేవి. వీటిలో వందలాది మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని పొందేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం కొబ్బరి పీచు పరిశ్రమ పూర్తిగా ప్రాభావాన్ని కోల్పోయింది. ఉద్దానం కొబ్బరికి చీడపీడల కారణంగా నాణ్యత లోపించడం కంచిలి కొబ్బరి మార్కెట్‌పై తీరని ప్రభావం చూపింది. మరోపక్క పీచు ధర సగానికి పడిపోయింది. దీంతో కొబ్బరి పీచు పరిశ్రమ దివాలాస్థితికి చేరింది. ఆ భవనాలు గోడౌన్‌లుగా మారాయి. ఇక్కడ పనిలేక కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.
ఇదీ పరిస్థితి..
గతంలో కంచిలితో పాటు పరిసర గ్రామాల్లో సుమారు 14 కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండేవి. ఈ పరిశ్రమల్లో ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, యువకులు పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధిపొందేవారు. కంచిలిలో తయారయ్యే పీచుకు మంచి గిరాకీ ఉండేది. నాణ్యమైన కొబ్బరి పీచును తయారు చేసి దేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, అహ్మదాబాద్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. దీంతో కార్మికులతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడేది. అయితే, కాలక్రమంలో ఉద్దానంలో ప్రకృతి విలయాలకు కొబ్బరి పంట పూర్తిగా నాశనం కావడడం, చీడ పీడలు, తెగుళ్లతో కాయల నాణ్యత, దిగుబడి తగ్గడంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా కొబ్బరి మార్కెట్‌పై, పరోక్షంగా పీచు పరిశ్రమలపై పడింది. మొదట్లో వాటిని ఎలాగో యజమానులు నెట్టుకొచ్చారు. అయితే, రానురాను నష్టాలు ఎక్కువకావడంతో భరించలేక పరిశ్రమలను మూసివేశారు. ప్రస్తుతం కేవలం 4 మాత్రమే నడుస్తున్నాయి. టన్ను పీచు ధర రూ.18 వేల నుంచి రూ.10 వేలకు పడిపోయింది. దీంతో గోడౌన్‌లో సరుకు పేరుకుపోయింది. ప్రభుత్వాల నుంచి చేయూత లేక, పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని భరించలేక, యంత్రాల మరమ్మతులకు గురికావడం, అప్పుల పాలవ్వడం వంటి కారణాలతో పరిశ్రమలను మూసివేసినట్లు పలువురు యజమానులు చెబుతున్నారు. గతంలో కొబ్బరి పీచు పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అమలాపురం వంటి ప్రాంతాల్లో ఉచితంగా, లేదా తక్కువ ధరకే లభిస్తుండేది. అయితే, ప్రస్తుతం ముడి సరుకును అధిక ధరకు కొనుగోలు చేయాల్సి రావడం కూడా పీచు పరిశ్రమ దివాలాకు కారణమైందని యజమానులు వాపోతున్నారు.
కంచిలి మండలంలోని ఎస్‌ఆర్‌సీ పురం, అంపురం, బురదపాడు, పద్మతుల, గొల్లకంచిలి తదితర గ్రామాల్లో కొబ్బరి కార్మికులు ఉన్నారు. గతంలో స్థానికంగా నిర్వహిస్తున్న కొబ్బరి బడ్డీలు, కొబ్బరి పీచు పరిశ్రమల్లో పనులు చేసుకుంటూ వీరంతా జీవనం సాగించేవారు. ప్రస్తుతం కొబ్బరి పీచు పరిశ్రమలు మూతపడడంతో వాటి భవనాల్లో చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని భవనాలు చెత్తను విక్రయించే షాపులుగా, మరికొన్ని గోడౌన్‌లుగా మారాయి. అలాగే, మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బతింది. దీంతో స్థానికంగా పనులు లభించకపోవడంతో కార్మికులు వలస పోతున్నారు. గతంలో ఇక్కడ తయారు చేసిన పీచును ఏ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారో, ఇప్పుడు అదే రాష్ర్టాలకు వలస కూలీలుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వీరంతా ఎటువంటి భద్రతలేని పనుల్లో ఉంటూ కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారు. వలసలు నివారిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో స్థానికంగా కొబ్బరి మార్కెట్‌కు, కొబ్బరి పీచు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రోత్సాహం అందించాలి
నిర్వహణ ఖర్చులు పెరగడం, ముడి సరుకుల స్థానికంగా లభించకపోవడంతో పీచు పరిశ్రమ నిర్వహించడం చాలా కష్టంగా ఉంది. పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. సబ్సిడీపై రుణాలు అందించడం, రాయితీపై యంత్రాలు మంజూరు చేయడం చేస్తే పరిశ్రమ అభివృద్ధి చెందడమే కాకుండా పది మందికి ఉపాధి లభిస్తుంది.
- పండి రవి, పీచు పరిశ్రమ నిర్వాహకుడు