Share News

సీఎం సారూ.. సమస్యలు పరిష్కరించరూ

ABN , Publish Date - May 16 , 2026 | 12:10 AM

Uncompleted development works ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఎన్నికల తర్వాత రెండోసారి జిల్లాకు వస్తు న్నారు. నేడు నరసన్నపేట మండలంలో పర్యటిస్తున్నారు. కాగా రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉన్న శ్రీకాకు ళం.. వెనుకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుగాం చింది. దీన్ని రూపుమాపాలంటే.. స్థానికంగానే జిల్లాలో ఉపాఽధి లభించేలా.. సహజ వనరులను అభివృద్ధి చేస్తే జిల్లా ప్రజ లకు కూడా మేలు కలుగుతుంది.

సీఎం సారూ.. సమస్యలు పరిష్కరించరూ
శ్రీకాకుళంలో అసంపూర్తిగా కేఆర్‌ స్టేడియం పనులు

  • పూర్తికాని అభివృద్ధి పనులు

  • ప్రాజెక్టులకు కానరాని మరమ్మతులు

  • తాగు, సాగునీటికి ఇబ్బందులు

  • అరకొరగా వైద్యసేవలు

  • ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే జిల్లావాసుల ఆశలు

  • శ్రీకాకుళం, మే 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఎన్నికల తర్వాత రెండోసారి జిల్లాకు వస్తు న్నారు. నేడు నరసన్నపేట మండలంలో పర్యటిస్తున్నారు. కాగా రాష్ట్రంలోనే తలసరి ఆదాయం తక్కువగా ఉన్న శ్రీకాకు ళం.. వెనుకబడిన ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరుగాం చింది. దీన్ని రూపుమాపాలంటే.. స్థానికంగానే జిల్లాలో ఉపాఽధి లభించేలా.. సహజ వనరులను అభివృద్ధి చేస్తే జిల్లా ప్రజ లకు కూడా మేలు కలుగుతుంది. ఆ దిశగా జిల్లాలో సమ స్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి దిశగా జిల్లాకు వరాల జల్లు కురిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • సమస్యలు ఇవే :

  • వైసీపీ ప్రభుత్వం గతంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసింది. 2014-19 మధ్యలో శ్రీకాకుళంలోని కేఆర్‌ స్టేడియం పునఃనిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో కేఆర్‌ స్టేడియం పనుల్లో పురోగతి లేదు.

  • వంశధార షట్టర్ల కుంభకోణం.. ఏసీబీ కోర్టులో దశా బ్దాలుగా పెండింగ్‌లోనే ఉంది. షట్లర్లు తుప్పుపట్టి వినియోగా నికి నోచుకోకుండా ఉన్నాయి. కొన్ని చోరీకి గురయ్యాయి.

  • నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఇటీవల అనుకూలంగా నిర్ణయం వెలువడింది. ఈ బ్యారేజీని పట్టాలెక్కిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, రైతులకు మేలు కలగనుంది.

  • శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్‌ సమయంలో సమకూర్చిన 300 వెంటిలేటర్లు మూలకు చేరాయి. అత్యధిక మంది జిల్లాలో శ్వాస సమస్యలతో ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అందుబాటులో వెంటిలేటర్‌ లేకుంటే రిఫరల్‌ చేస్తున్నారు. దీనిపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు.

  • జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన వైద్యులు అధికమంది శ్రీకాకుళం డేఅండ్‌నైట్‌ జంక్షన్‌లో ప్రైవేటు క్లినిక్‌ల్లో ప్రాక్టీసు చేసుకుంటున్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓపీ వేళల్లో అందుబాటులో ఉండకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

  • పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌లో కీలక వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. అవసరమైన పోస్టుల భర్తీని చేపట్టి.. కిడ్నీ రోగులకు సకాలంలో మరింతగా వైద్యసేవలు అందించాలి.

  • శ్రీకాకుళం మండలం సింగుపురం వద్ద నర్శింగ్‌ కళాశాలను కోట్ల నిధులతో నిర్మించి ఏళ్ల తరబడిగా వృథాగా వదిలేశారు.

  • జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం.. కొలువుల నియామకాల్లో అవకతవకలు, ఫైళ్లమాయం వంటి ఘటనలతో అప్రతిష్ట మూటకట్టుకుంటోంది. ఉద్యోగులు పెద్దఎత్తున నిరసన చేపట్టినా.. ప్రక్షాళన జరగడం లేదు.

  • జగనన్న లేఅవుట్లలో అవినీతి

  • వైసీపీ హయాంలో జగనన్న లేఅవుట్ల విషయంలో పెద్ద అవినీతి చోటుచేసుకుంది. తక్కువ ధరకు డి-పట్టా భూములను కొంతమంది వద్ద కొనుగోలు చేసి.. రికార్డులను మార్పుచేసి.. వాటిని అధిక ధరకు వైసీపీ నాయకులు ప్రభుత్వానికి విక్రయించారు. శ్రీకాకుళం నగర ప్రజలకు సెంటు స్థలాలు అంటూ ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద భూములను ఇలానే కొనుగోలు చేశారు. ఇక్కడ భూములకు భారీగా మొత్తాన్ని చెల్లించారు. వాస్తవంగా విజయనగరం రాజులు.. కొన్నాళ్ల క్రితం నలుగురు వ్యక్తులకు దివాణా భూములుగా ఇచ్చారు. రికార్డులు కూడా ఉన్నాయి. వాటిని మార్పు చేసి.. ఒకే వ్యక్తి పేరుతో సుమారు 130 ఎకరాలు విక్రయించేశారు. నలుగురి ఆసామీలు హక్కుదారులు కాగా.. ఒకరి పేరుతోనే భూమిని విక్రయించేయడం.. అప్పటి ప్రజాప్రతినిధులకు రెవెన్యూ అధికారులు కూడా ఎంతగానో సహకరించారు. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు చేరింది. దీనిపై సీఎం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • ఉద్దానం ప్రాంతానికి.. హిరమండలం రిజర్వాయర్‌ నుంచి తాగునీటిని ప్రత్యేక పథకం ద్వారా మళ్లిస్తున్నారు. అయితే రిజర్వాయర్‌ ఉన్న ప్రాంతం పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం సురక్షితమైన తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ ప్రత్యేకంగా రక్షితనీటి పథకాలు లేవు.

  • వైసీపీ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిరాయితీ భూములు సైతం, కొనుగోలు చేసిన భూములు.. 22ఏ జాబితాలోకి చేర్చేశారు. వీటిని మళ్లీ కొరిలేషన్‌ ప్రక్రియ చేపట్టి.. 22ఏ నుంచి తొలగించి భూముల క్రయవిక్రయాలకు అడ్డం లేకుండా చేసుకోవాలంటే రైతుల, ప్రజల తలప్రాణం కాళ్లకు వస్తోంది. రెవెన్యూ అధికారులు సరిగ్గా సహకరించడంలేదు. ఈవిషయమై ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తేనే ఫలితముంటుంది.

  • పదేళ్లకుపైగా సమగ్ర కలెక్టరేట్‌ నిర్మాణం సాగుతోంది. పనులు పూర్తిచేసి.. దీని వినియోగంలోకి తేవాల్సి ఉంది.

  • గొట్టాబ్యారేజీ శిధిలావస్థకు గురైంది. గొట్టాబ్యారేజీతోపాటు వంశధార ప్రాజెక్టు, కాలువల మరమ్మతులు చేయాల్సి ఉంది. హిరమండలం రిజర్వాయర్‌, వంశధార ఫేజ్‌-2 పనులు వేగవంతం చేయాలి.

  • పలాస నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు, ఆమదాలవలస నియోజకవర్గంలో మినీ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొంతమంది వీటికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ప్రజలకు వాస్తవం వివరించి పోర్టు, ప్లాంట్‌ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

  • జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్నా.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి.. ఇతర జిల్లాల వారికే ప్రాధాన్యమిస్తున్నారు. స్థానిక యువత ఉపాధి కోసం వలస పోతున్నారు.

  • ఆమదాలవలసలో దశాబ్దాల కిందట మూతపడిన చక్కెర కర్మాగార భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని ఇతర ప్రభుత్వ అవసరాలకు.. కీలక పరిశ్రమలకు.. ప్రాజెక్టులకు.. లేదా డాటా సెంటర్లకు కొనుగోలు చేసి ఆ భూములను కేటాయిస్తే.. సమీపంలో ఉన్న పోర్టు, ఎయిర్‌పోర్టు.. వీటివల్ల జిల్లా అభివృద్ధి రూపురేఖలు మారే అవకాశం ఉంది.

  • సువిశాల తీరం ఉన్నా.. పర్యాటకపరంగా జిల్లాలో ఎటువంటి ముందడుగు పడటంలేదు. వంశధార, నాగావళి నదులు ప్రవాహ దిశ మారడంతో శ్రీకాకుళం, గార మండలాల్లో బీచ్‌ రూపురేఖలు పోయాయి. ఇప్పటికైనా పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉందని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - May 16 , 2026 | 12:10 AM