కొందరికి సీఎం అక్షింతలు
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:39 PM
సిక్కోలు ప్రజాప్రతినిధులతో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష మంగళవారం ముగిసింది.
-ముగిసిన సిక్కోలు ప్రజాప్రతినిధులతో సమీక్ష
-సర్వే నివేదికలు బహిర్గతం చేసిన ముఖ్యమంత్రి
-అందరి పనితీరు 72 శాతం పైనే..
-వ్యతిరేక అంశాలను స్పష్టం చేసిన చంద్రబాబు
-సరిదిద్దుకోవాలని హితవు
శ్రీకాకుళం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): సిక్కోలు ప్రజాప్రతినిధులతో విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సమీక్ష మంగళవారం ముగిసింది. జిల్లాకు చెందిన కొందరి ప్రజాప్రతినిధుల పనితీరును నర్మగర్భంగా వెల్లడిస్తూ.. సమీక్షలోనే సీఎం అక్షింతలు వేశారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాకు సంబంధించి ఆర్థికపరమైన, ఆర్థికేతరమైన అంశాలను ముందుగా చర్చించారు. అనంతరం ఒక్కో ఎమ్మెల్యే పనితీరు.. తన వద్ద నివేదికలు, సర్వే ఆధారంగా సీఎం వెల్లడించారు. అయితే ఎనిమిదిమంది ప్రజాప్రతినిధులకూ సీఎం నిర్వహించిన సర్వేలో 72 శాతంపైబడి ప్రజల నుంచి సానుకూలంగా స్పందన లభించిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మీద సర్వే నివేదికను మాత్రమే వినిపించి.. అక్కడ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడి అంతటితో ఆపేశారు. అలాగే అందరి ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ కూటమి నాయకులను కలుపుకుని వెళ్లాలని సూచించారు. ఓ ఎమ్మెల్యే విషయమై మాట్లాడుతూ.. వ్యవహార శైలి మార్చుకోవాలని, ఇతర కులాల వారినీ కలుపుకుని వెళ్లాలని సీఎం హితవు పలికారు. మరో ప్రజాప్రతినిధి గురించి మాట్లాడుతూ.. ‘నీ నియోజకవర్గంలో సర్వే జరిపితే గుడ్ బిహేవియర్ అని వెల్లడైంది. ప్రజలు అలా ఎలా అంటున్నారు?’ అని నవ్వుతూ ప్రశంసలు కురిపించారు. మరో ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తూ .. బిహేవియర్‌పై నెగిటివిటీ బాగా పెరిగిందని, వెంటనే సరిచేసుకోవాల్సిందేనని, సౌమ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదని కాస్త గట్టిగానే చెప్పారు. ఇక కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పనితీరును ప్రశంసించారు. అనంతరం ప్రాధాన్యపరంగా.. జిల్లా అభివృద్ధికి సంబంధించి నివేదికలు, అత్యవసరంగా విడుదల చేయాల్సిన నిధులు, తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కీలకమైన ప్రాజెక్టుల గురించి సమీక్షించి ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్, గౌతు శిరీష, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.