కొండలెక్కుతూ... పాఠాలు బోధిస్తూ!
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:23 AM
The light of literacy in remote tribal villages అవి మారుమూల గిరిజన గ్రామాలు. కొండలపై ఉన్న పాఠశాలల్లో చదువులు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు కొండలు ఎక్కుతూ బోధన సాగిస్తున్నారు. గిరిజన విద్యార్థుల్లో అక్షర వెలుగులు నింపుతున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. అలాంటి గురువుల గురించి కథనం..
మారుమూల గిరిజన గ్రామాల్లో అక్షర వెలుగులు
ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు
నేడు ఉపాధ్యాయ దినోత్సవం
మెళియాపుట్టి/ పాతపట్నం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అవి మారుమూల గిరిజన గ్రామాలు. కొండలపై ఉన్న పాఠశాలల్లో చదువులు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు కొండలు ఎక్కుతూ బోధన సాగిస్తున్నారు. గిరిజన విద్యార్థుల్లో అక్షర వెలుగులు నింపుతున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. అలాంటి గురువుల గురించి కథనం..
మెళియాపుట్టి మండలంలో కేరాశింగి గ్రామానికి వెళ్లాలంటే ఐదు కొండలు ఎక్కాల్సిందే. ఈ గ్రామంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో(జీపీఎస్) 8 మంది విద్యార్థులు ఉన్నారు. సవర బెంజిమెన్ అనే ఉపాధ్యాయుడు గత ఐదేళ్లుగా ఇక్కడ బోధన చేపడుతున్నారు. ఈయన రోజూ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస నుంచి ద్విచక్రవాహనంపై కొండ దిగువ భాగం వరకూ వస్తుంటారు. అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లకుపైగా కాలినడకన ఐదుకొండలు ఎక్కి పాఠశాలకు చేరుకుంటారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రోడ్డు పనులు కాక.. నడక పాట్లు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో అటవీ జంతువుల బెడద వెంటాడుతుంది. నిత్యం ఈ కష్టాలను దాటుకుని.. గిరిజన విద్యార్థుల్లో అక్షర వెలుగులు నింపేందుకు బెంజిమెన్ మాస్టారు కృషి చేస్తున్నారు. పాఠశాలలో వసతి సౌకర్యం లేకపోయినా.. వరండాలో బోధన సాగిస్తున్నారు.
ఇదే మండలం అనంతగిరి జీపీఎస్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బి.శంకరరావు రోజూ గొడ్డ గ్రామం జంక్షన్‌లో ఆటో దిగి.. మూడు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వస్తుంటారు. ఇక్కడ పదిమంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామంలోని ఒక ఇంటిమేడపై విద్యాబోధన చేపడుతున్నారు.
పాతపట్నం మండలం కోణింగి గిరిజన ప్రాథమిక పాఠశాలలో పెద్దింటి మురళి అనే ఉపాధ్యాయుడు ఐదేళ్లుగా బోధన చేపడుతున్నారు. ఈయన లాబర నుంచి సుమారు 20కిలోమీటర్లు ద్విచక్రవాహనంపై ప్రయాణించి.. మూడు కొండలు దాటి ఇక్కడ పాఠశాలకు చేరుకుంటారు. ఆటపాటలతోపాటు బొమ్మలు ఆధారంగా బోధన సాగిస్తూ.. విద్యార్థుల్లో చదువుపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. కోణంగితోపాటు మెళియాపుట్టి మండలానికి చెందిన రొంపి, పెంగువాడ, టెక్కలి మండలం డబారు గ్రామాల నుంచి సైతం విద్యార్థులు 43 మంది ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.
సొంత నిధులతో పాఠశాల అభివృద్ధి
మెళియాపుట్టి మండలంలోని ముఖందుపురంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో రెండేళ్ల కిందట నలుగురు విద్యార్థులు ఉండేవారు. ఉపాధ్యాయుడు సవర రామారావు కృషితో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 22కి చేరింది. ఈయన పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చేసేందుకు రూ.3లక్షలు సొంత నిధులు ఖర్చు చేశారు. మరింత మెరుగైన బోధనకుగానూ.. మరో వలంటీర్‌ను నియమించి.. ప్రతినెలా తన జీతంలో రూ.5వేలు ఇస్తున్నారు. నో బ్యాగ్ డేరోజు ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్ కోసం విద్యార్థులకు దుస్తులు అందజేశారు. పాఠశాల ఆవరణలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహంతోపాటు సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. నర్సరీ కూడా ఏర్పాటు చేసి.. మండలంలో పలు పాఠశాలలకు మొక్కలు అందజేస్తున్నారు. పాఠశాల ఆవరణలోనే సంప్రదాయపద్ధతిలో కూరగాయలు పండిస్తూ.. విద్యార్థులకు వాటిని వండిపెడుతున్నారు. అలాగే ఇదే మండలం దీనబంధుపురం పాఠశాలల్లో ఉపాధ్యాయుడు జె.సంపత్‌కుమార్ ఆటపాటలతో బోధన సాగిస్తూ.. విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు.