సచివాలయాల ప్రక్షాళన!
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:10 AM
Salary cuts if punctuality రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోంది. గ్రామస్థాయిలో పాలనతోపాటు పౌరసేవలు, సంక్షేమ పథకాలు అందించే సచివాలయాలను బాధ్యతాయుతమైన వ్యవస్థగా మార్పు చేయాలని భావించింది.
సిబ్బంది సమయపాలన పాటించకపోతే జీతాల్లో కోత
ఇకపై స్వర్ణ గ్రామాలు, వార్డులుగా పేరు మార్పు
కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు
ఇచ్ఛాపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోంది. గ్రామస్థాయిలో పాలనతోపాటు పౌరసేవలు, సంక్షేమ పథకాలు అందించే సచివాలయాలను బాధ్యతాయుతమైన వ్యవస్థగా మార్పు చేయాలని భావించింది. అందులో భాగంగా గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా, వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డులుగా మార్చేందుకు ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సచివాలయ వ్యవస్థలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల అంతర్ మండలాల బదిలీ, ఉద్యోగుల సర్దుబాటు వంటి నిర్ణయాలు అమలుచేస్తోంది. ఇప్పుడు పనివేళల విషయంలో పటిష్ట చర్యలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే జీతాల్లో కోత విధించనుంది.
ఇదీ పరిస్థితి..
గ్రామస్థాయిలో సుపరిపాలన అందించేందుకు గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. ఒక్కో సచివాలయంలో 13మంది సహాయకులను నియమించింది. జిల్లాలో 835 గ్రామ, 95 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 8,056 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది సమయపాలన పాటించడం లేదని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితిని గాడిన పెట్టేలా ప్రభుత్వం కఠినచర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ముఖ హాజరును తప్పనిసరి చేసింది. పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కచ్చితంగా సచివాలయంలోనే ఆన్లైన్ ద్వారా ఉదయం, సాయంత్రం హాజరువేసేలా చర్యలు చేపట్టింది. హాజరువేయకుంటే ఆ రోజు గైర్హాజరుగా పరిగణలోకి తీసుకొని వేతనంలో కోత పెట్టే విధంగా విధి విధానాలను సైతం రూపొందించింది. సచివాలయాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రతి మండలానికి ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. దీంతో వారే నేరుగా సచివాలయాల పర్యవేక్షణ చూస్తున్నారు. లోపాలను సరిచేస్తున్నారు.
సమయపాలనపై దృష్టి
జిల్లాలో సచివాలయ వ్యవస్థ పనితీరు మెరుగుపడింది. ముఖ్యంగా ఉద్యోగుల సమయపాలనపై దృష్టిపెట్టాం. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించాం. ముఖహాజరులో కూడా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇచ్చాం.
- జి.అరుంధతిదేవి, సచివాలయాల ప్రత్యేకాధికారిణి, శ్రీకాకుళం