Share News

అందరూ సహకరిస్తేనే స్వచ్ఛత

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:11 AM

Notices for dumping garbage in vacant lots ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే.. సంబంధిత యజమానులకు, నివాసితులకు నోటీసులు జారీచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

అందరూ సహకరిస్తేనే స్వచ్ఛత
ఇందిరానగర్‌ కాలనీలో కాలువలు పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే నోటీసులు

డయేరియా కేసులు తగ్గుముఖం

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే.. సంబంధిత యజమానులకు, నివాసితులకు నోటీసులు జారీచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీకాకుళంలోని పలు వీధుల్లో ఆయన పర్యటించారు. విశాఖ-బీ, ఇందిరానగర్‌ కాలనీలో పారిశుద్ధ్యం, కాలువల పరిస్థితిని పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను తొలగించాలని స్పష్టం చేశారు. ఇకపై ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ అధికారులకు ఆదేశించారు. అలాగే చేపల మార్కెట్‌ వద్ద కుళాయి లీకేజీని గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడురోడ్ల కూడలి నుంచి మెయిన్‌ రోడ్డు(జీటీ రోడ్డు), రైతుబజార్‌కు వెళ్లే రహదారి కాలువలు, సూర్యమహల్‌ రోడ్డు వైపు వెళ్లే మార్గంలో కాలువలను పరిశీలించారు. లీకేజీలు ఉన్న షాపుల యజమానులకు వాటిని నివారించాలని, లేదంటే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. అవసరమైన చోట కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.

డయేరియా తగ్గుముఖం

‘శ్రీకాకుళంలో డయేరియా పూర్తిగా తగ్గింది. ఇంటింటా సర్వేలో కేసులు తగ్గుముఖం పట్టిన విషయం ఖరారైంది. వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 87 కేసులు ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తంగా ఉండాల’ని కలెక్టర్‌ సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అందరి సహకారంతోనే స్వచ్ఛత సాధ్యపడుతుందన్నారు. ప్రజలు వేడి చేసిన నీటినే తాగాలని సూచించారు.

Updated Date - Mar 01 , 2026 | 12:11 AM