Share News

సెలవుల్లో పిల్లలు జాగ్రత్త

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:28 AM

సంక్రాంతి పండుగ వచ్చేసింది. విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇచ్చేశారు.

   సెలవుల్లో పిల్లలు జాగ్రత్త

- పండుగ వేళ వారిపై ఓ కన్నేయాలి

- వాహనాలు ఇవ్వొద్దు

- ఈత రాకుండా చెరువులు, గుంతల్లో దిగవద్దు

గతేడాది మే 7న వేసవి సెలవుల్లో రణస్థలం మండలం అర్జునవలసలో ఉంటున్న తన నాన్మమ్మ ఇంటికి పదో తరగతి చదువుతున్న వడ్డాది గౌతమ్‌రాజ్‌కుమార్‌ అనే విద్యార్థి తన తండ్రి తండ్రి లక్ష్మణరావుతో కలిసి వచ్చాడు. గౌతమ్‌, తన స్నేహితుడు దుర్గాప్రసాద్‌ కలిసి గ్రామ శివారులోని బావి వద్దకు స్నానం కోసం వెళ్లారు. స్నేహితుడు ఈత వచ్చా అని గౌతమ్‌ను అడుగగా వచ్చునని చెప్పి బావిలోకి దిగాడు. కొద్ది సేపటికే గౌతమ్‌ నీటిలో ముగిని ప్రాణాలు వదిలాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తండ్రి ఇప్పటికీ బాధపడుతున్నాడు.

గతేడాది మే 26న కంచిలి మండలం సామంతపుట్టుగలో జరిగిన గ్రామదేవత ఉత్సవాలకు అదే మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక బాడపల్లి నందిని వెళ్లింది. అక్కడ విద్యుత్‌ అలంకరణకు వినియోగించిన ఇనుప తీగ (జీ వైరు) తగిలి నందిని మృతి చెందింది.

నరసన్నపేట, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వచ్చేసింది. విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇచ్చేశారు. ఈ సెలవుల్లో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మాత్రం మూల్యం తప్పదు. సరదామాటున వారు చేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి కన్నవారికి కడుపుకోతను మిగులుస్తాయి. అందుకే సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి.

ఇవి పాటించాలి..

  • సంక్రాంతి కోసం పట్టణాల నుంచి పల్లెలకు వచ్చే పిల్లలు సరదాగా ఈత కొట్టేందుకు చెరువలు, బావులు, కాలువల వద్దకు వెళ్తుంటారు. అయితే, ఈత రాకుండా నీటిలోకి దిగడం అత్యంత ప్రమాదకరం. కొన్ని చెరువుల్లో ఊబిలు ఉంటాయి. కాలువల్లో కూడా అక్కడక్కడ గుంతలు ఉన్నాయి. ఇవి నీటితో నిండి ఉంటాయి. తెలియకుండా దిగితే ప్రమాదంలో చిక్కుకుపోతారు. సెలవులకు వచ్చే పిల్లలకు ప్రమాదకరమైన చెరువులు, కాలువలు, కుంటల గురించి చెప్పాలి. అటువైపుగా వెళ్లినప్పుడు పెద్దవారి తోడు తీసుకొని వెళ్లాలని చెప్పాలి. బహిర్భూమికి కోసం పిల్లలను చెరువుల వైపు పంపించకూడదు.

  • పిల్లలకు కార్లు, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాటిన నడిపేందుకు రోడ్డెక్కుతుంటారు. మితిమీరిన వేగానికి తోడు రహదారి భద్రత పాటించడం లేదు. అర్ధరాత్రి లాంగ్‌ డ్రైవింగ్‌ అంటూ చేసే ప్రయాణాలు చేటు తెస్తున్నాయి. అతి వేగం కారణంగా జరుగుతున్న ప్రమాదాలు బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ఒక్కోసారి వీరి కారణంగా ఎదుటి కుటుంబాలు సైతం వీధినపడుతున్నాయి. అందుకే పిల్లల చేతికి వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ వాహనం నడిపే అర్హత ఉంటే పూర్తిగా అవగాహన, అవసరం మేరకు మాత్రమే వారి చేతికి వాహనం ఇవ్వాలి. పెద్దల సమక్షంలోనే వాహనాలు తీయించాలి.

  • ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు.? ఏం చేస్తున్నారు.? అనేది తల్లిదండ్రులకు పెద్దగా తెలియట్లేదు. ఈ సెలవుల్లో మాత్రం వారిపై దృష్టి సారించాలి. స్నేహితులతో బయటకు వెళ్తామని వారు చెబితే ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోండి. ఎప్పుడు వస్తారో అడగండి. అప్పుడే వారిలో భయం ఉంటుంది.

  • గాలిపటాలను ఎగురవేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యుత్‌ వైర్లకు అవి చిక్కుకున్నప్పుడు వాటిని తొలగించే క్రమంలో ప్రమాదాల బారినపడి గతంలో ఎందరో చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. విద్యుత్‌ తీగలు లేని చోట గాలిపటాలను ఎగుర వేయాలని పిల్లలకు చెప్పండి. ఒకవేళ కరెంట్‌ తీగలు, చెట్ల కొమ్మలకు గాలిపటాలు చుట్టుకుని ఉండిపోతే వాటిని తీయవద్దని చెప్పండి.

  • సంక్రాంతి అంటేనే విందు.. మందు పసందులు ఉంటాయి. ఇలాంటి వాటికి మీ పిల్లలను దూరంగా ఉంచండి. స్నేహితుల్లో ఎవరికో ఒకరికి గంజాయి, డ్రగ్స్‌, సిగరెట్‌ అలవాటు ఉంటే మిగతా వారు ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారే ఏమీకాదులే అనే ప్రోత్సాహం మత్తులోకి బలంగా దించుతోంది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో సైతం ఇప్పుడు పార్టీ కల్చర్‌ ఉంటోంది. సరదాగా ఒకసారి అనే మాటగా మొదలై.. మత్తు అనే మాయలో పడేస్తోంది. అందుకే సెలవుల్లో పిల్లల విషయంలో తల్లదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి సకాలంలో ఇంటికి వచ్చేయమని చెప్పండి. డ్రగ్స్‌ తీసుకోవడం వలన కలిగే అనర్థాలను తెలియజేయండి. పందెలకు, గుండాట, మూడు ముక్కలాటకు దూరంగా ఉండాలని చెప్పండి.

వాహనాలు ఇవ్వొద్దు

పిల్లలకు డ్రైవింగ్‌ వచ్చినా వారికి వాహనాలు ఇవ్వొద్దు. లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. స్పీడుగా డ్రెవింగ్‌ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం. పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించాలి.

-లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి

పిల్లల వెంట ఉండాలి

వేసవి సెలవుల్లో పిల్లలను కంటి రెప్పలా చూసుకోవాలి. చెరువులు, కాలువలు, నదుల వద్దకు వారు వెళ్లకుండా చూడాలి. తల్లిదండ్రులు పిల్లల వెంట ఉంటూ వారిని కనిపెట్టాలి.

- రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం

Updated Date - Jan 10 , 2026 | 12:28 AM