పిల్లలూ జాగ్రత్త!
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:00 AM
Children, be careful! ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా జరిగే మూల్యంపై చర్చ సాగుతోంది. ఇటీవల గుండుపేటతోపాటు పలుచోట్ల జరిగిన ఘటనలే గుణపాఠం నేర్పుతున్నాయి.
ఏమరపాటుకు తప్పదు మూల్యం
తల్లిదండ్రుల అప్రమత్తతే శ్రీరామరక్ష
గుండుపేట ఘటనే ఒక గుణపాఠం
రణస్థలం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి)
గత ఏడాది విజయనగరంలో నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. ఆటలు ఆడుకుంటూ కారు ఎక్కగా దాని లాక్ ఆటోమేటిక్‌గా పడిపోయింది. దీంతో అందులో చిక్కుకొని ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చింది.
రెండు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లా తునిలో జ్ఞానేశ్వరి అనే రెండేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. ఇప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు. పామాయిల్ తోటలో కుటుంబం నివాసముండగా ఈ చిన్నారి కనిపించకుండా పోవడంతో వేలాది మంది పోలీసులు జల్లెడ పట్టినా ఇంతవరకూ ఆచూకీ లేకపోవడం ఆందోళన కలిగించింది.
మూడేళ్ల కిందట జి.సిగడాం మండలం మెట్టవలసలో 18 నెలల చిన్నారి వీధి కుక్కల బారిన పడి మృతిచెందింది. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని కుక్కల గుంపు సమీప తోటల్లోకి ఈడ్చుకుపోయి దాడిచేశాయి.
తాజాగా ఈ నెల 14న రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయాతీ గుండుపేటలో (ఎన్‌జీపురం) రెండేళ్ల మోహిత్ అనే బాలుడు అదృశ్యమై రాత్రంతా కనిపించకుండా పోయాడు.చివరకు సమీప తోటల్లోనే ఉదయం ఆచూకీ దొరకడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా జరిగే మూల్యంపై చర్చ సాగుతోంది. ఇటీవల గుండుపేటతోపాటు పలుచోట్ల జరిగిన ఘటనలే గుణపాఠం నేర్పుతున్నాయి. పిల్లలు ఆడుకుంటున్నారని ఏమరపాటుగా విడిచిపెట్టినా.. నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారు ప్రమాదంలో పడినట్టే. చిన్నారులకు దేనిని తాకాలి.. దేనిని తినాలి.. దేనికి దూరంగా ఉండాలి.. ఏది అపాయం.. అన్న విషయం తెలియదు. ఏది దొరికినా తినేస్తారు. ఎక్కడికైనా వెళ్లిపోతారు. ప్రమాదమని తెలియదు కాబట్టి వాటి బారిన పడతారు. అందుకే చిన్నపిల్లల కదలికల విషయంలో తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
జిల్లాలోని గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలే అధికం. కుటుంబమంతా పొలాలు, తోటల్లో పనిచేసే క్రమంలో ఇంట్లో ఉండే పిల్లల విషయంలో చాలామంది శ్రద్ధ చూపరు. ఈ తరుణంలో పిల్లలు సమీప తోటలు, పొలాల్లోకి వెళుతుంటారు. అయితే అక్కడ నేలబావులు, చెరువులు, గుంతలు, వన్యప్రాణులు, విష సర్పాలు ఉంటాయి. అందుకే జాగ్రత్తగా ఉండకపోతే చిన్నారులకు ప్రమాదకరమే. మరోవైపు విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇళ్ల సమీపంలో, ప్రాంగణాల్లో ప్రమాదకరమైన స్విచ్‌బోర్డులు, వైర్లు ఉంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా చిన్నారులు వాటిని తాకినా ప్రమాదమే. అలాగే కొంతమంది చిన్నారులు తెలియకుండానే వాహనాల కింద చేరి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. అందుకే ఐదేళ్లలోపు చిన్నారుల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నిరంతం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న మూల్యం తప్పదు. పిల్లలకు కొత్త ప్రదేశం అన్న అవగాహన ఉండదు. ఆపై వాహనాల విషయంలో సైతం వారికి అవగాహన లేక ఎదురెళ్తుంటారు. కారు పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల చేతిలో కారు తాళాలు పెట్టకూడదు.
- కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం