వరహాలుగెడ్డ ఆక్రమణకు చెక్
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:27 AM
Soil excavations should be stopped పలాస మండలం కంబిరిగాం వద్ద వరహాలుగెడ్డలో ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేని మట్టి తవ్వకాలను అడ్డుకొని ట్రాక్టర్లు, యంత్రాలను సీజ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరహాలుగెడ్డ, సమీపంలో ఉన్న పంట భూముల్లో తవ్వకాలను తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, రెవెన్యూ అధికారులు, కాశీబుగ్గ పోలీసులు పరిశీలించారు.
మట్టితవ్వకాలు నిలిపివేయాలని అధికారుల ఆదేశం
పలాస, మార్చి 8(ఆంధ్రజ్యోతి): పలాస మండలం కంబిరిగాం వద్ద వరహాలుగెడ్డలో ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతులు లేని మట్టి తవ్వకాలను అడ్డుకొని ట్రాక్టర్లు, యంత్రాలను సీజ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరహాలుగెడ్డ, సమీపంలో ఉన్న పంట భూముల్లో తవ్వకాలను తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, రెవెన్యూ అధికారులు, కాశీబుగ్గ పోలీసులు పరిశీలించారు. కొన్నేళ్ల కిందట అక్రమార్కులు ఈ ప్రాంతంలో 10 సెంట్లు ఆక్రమించి.. మట్టితో చదును చేశారు. రెండు రోజుల కింద మరో 6 సెంట్లు ఆక్రమించి.. మట్టిని నింపారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో జిరాయతీ భూమిని చదును చేసుకునేందుకు కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ వారికి అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం పంట పొలంలో అడుగు లోతు వరకూ తవ్వుకోవాలి. అయితే సంబంధిత వ్యక్తులు మాత్రం ఐదు అడుగుల మేర తవ్వకాలు చేసి మట్టిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సమీప 20 మీటర్ల దూరంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయిల్ పైపులైన్ ఉంది. కాగా అనుమతికి మించి తవ్వకాలు కారణంగా ప్రమాదం పొంచి ఉండడంతో ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు. పైపులైన్లకు ముప్పు వాటిల్లితే ఎవరు సమాధానం చెబుతారని రైతులను ప్రశ్నించారు. అనుమతి లేకుండా తవ్వకాలు చేస్తున్న ప్రొక్లయినర్, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి వాటిని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ ‘అనుమతి ఇచ్చామని ఏకంగా కొంతమంది ఇటుకల తయారీకి మట్టిని తరలిస్తున్నారు. మేము పొలం చదును చేసుకోవడానికి అవకాశం ఇస్తే తప్పుదారి పట్టించారు. దీనిపై కేసు నమోదు చేశాం. అలాగే వరహాలుగెడ్డలో మొత్తం 16 సెంట్లు స్థలం ఆక్రమణకు గురైంది. తక్షణమే అందులో మట్టిని తీయాలని రైతులకు హెచ్చరించాం. లేదంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ’ని తెలిపారు.