Share News

భూ సమస్యలకు చెక్‌

ABN , Publish Date - May 13 , 2026 | 12:18 AM

Implementation of ‘One Month.. One Village’ గ్రామాల్లో భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం.. ‘ఒక నెల.. ఒక గ్రామం నాలుగుసార్లు సందర్శన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఆ నెలలో ప్రతి గురువారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించి.. భూ సమస్యల వినతులను పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

భూ సమస్యలకు చెక్‌
దీనబంధుపురంలో రెవెన్యూ గ్రామ సభ(ఫైల్‌)

  • నూతన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం

  • జిల్లాలో ‘ఒక నెల .. ఒక గ్రామం’ అమలు

  • ప్రతి గురువారం గ్రామాల్లో పర్యటించనున్న రెవెన్యూ అధికారులు

  • మెళియాపుట్టి, మే 12(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో భూ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం.. ‘ఒక నెల.. ఒక గ్రామం నాలుగుసార్లు సందర్శన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నెలా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి.. ఆ నెలలో ప్రతి గురువారం ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహించి.. భూ సమస్యల వినతులను పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. మొదటి గురువారం భూ సమస్యలపై రైతుల నుంచి వినతులు స్వీకరిస్తారు. రెండో గురువారం ఆ వినతుల పురోగతిని రైతులకు తెలియజేస్తారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలిస్తారు. మూడో గురువారం భూ సమస్యలను పరిష్కరిస్తారు. రికార్డుల సవరణ, ఈకేవైసీ వంటి వాటిని పూర్తిచేస్తారు. నాల్గో గురువారం గ్రామసభను నిర్వహిస్తారు. దరఖాస్తుల పరిష్కారంపై ప్రజలకు, రైతులకు స్పష్టత ఇస్తారు. న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్ప.. మిగిలిన అన్ని భూ సమస్యలను పరిష్కరిస్తారు. తర్వాత మరో గ్రామాన్ని ఎంపిక చేసి నెలలో నాలుగుసార్లు సందర్శించి సమస్యలను పరిష్కరిస్తారు. ఇలా నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో 30 మండలాల్లోని 30 గ్రామాల్లో ఈ నెల 7 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదాహరణకు మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలో రెవెన్యూ అధికారులు సదస్సు నిర్వహించి.. భూ సమస్యలపై రైతుల నుంచి వినతులు స్వీకరించారు. దీంతో తమ సమస్యలకు పరిష్కారం లభించనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి

  • జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగింది. చాలాచోట్ల ఒకరి భూమి.. మరొకరి పేరు మీదు నమోదు చేసి.. భూ రికార్డులు తారుమారు అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. 2024 జనవరి వరకు రెండు విడతల్లో 738 రెవిన్యూ గ్రామాల్లో భూములు రీ సర్వే చేశారు. ఇద్దరు అన్నదమ్ములకు చెందిన భూమికి ఒకే నెంబర్‌లో జాయింట్‌ ఎల్‌పీఎం కేటాయించారు. పక్కవారిని కూడా వాటాదారులుగా చేర్చి నంబర్లు ఇవ్వడంతో.. వాటిని మార్చుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో సరిచేయడానికి జాయింట్‌ ఎల్‌పీఎమ్‌కు రూ.6,50, సింగిల్‌ ఎల్‌పీఎమ్‌కు 50 చొప్పున చెల్లించాలని ప్రకటించింది. కాగా తప్పులు సరిచేసేందుకు కిందస్థాయిలో రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తుండడంతో రైతులు విసిగిపోయి దీనిపై ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ జిల్లాలో సుమారు 3వేల మంది దరఖాస్తులు చేసుకోగా.. కొన్నిమాత్రమే పరిష్కారమయ్యాయి.

  • గత ప్రభుత్వం 22ఏ కింద కొన్ని భూములను చేర్చి ఇబ్బందులకు గురిచేసింది. కూటమి ప్రభుత్వానికి దీనిపై కూడా ఫిర్యాదులందాయి. దీంతో ప్రతి సోమవారం రెవెన్యూక్లినిక్‌లు ఏర్పాటు చేసి.. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. 5,497 కేసులకు సంబంధించి 7,896 ఎకరాలకు 22ఏ జాబితా నుంచి మోక్షం కల్పించింది.

  • ఎన్నో సమస్యలకు మోక్షం

  • రెవెన్యూక్లినిక్‌లతో పాటు.. ప్రభుత్వం జిల్లాపరిషత్‌ కార్యాలయంతోపాటు.. అన్ని మండలాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక- మీకోసం కార్యక్రమానికి అధిక సంఖ్యలో వినతులు భూ సమస్యలపైనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు ‘ఒక నెల.. ఒక గ్రామం’ కార్యక్రమం ద్వారా పూర్తిస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా మ్యుటేషన్‌ల సవరణ, క్రయవిక్రయాల ద్వారా జరగాల్సిన మ్యుటేషన్‌లు, నోషనల్‌ ఖాతాలను రెగ్యులర్‌గా మార్చడం, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, రీ సర్వే సమస్యలు, ఎఫ్‌లైన్‌ పిటీషన్లు, సరిహద్దుల వివాదాలు, తగాదాలు, పొలం గట్టు రహదారి వివాదాలు, కుటుంబంలో ఉమ్మడి భూముల్లో ఉన్న వివాదాలు, ఎల్‌పీఎం సర్వే నెంబర్ల సవరణలు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, అసైన్డ్‌ భూముల ఆక్రమణ, 22ఏ జాబితా, మిస్‌ అయిన సర్వే నెంబర్లను గుర్తించడం వంటివాటిపై అధికారులకు దరఖాస్తులు అందించవచ్చు. వీటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు చేపడతారు. ప్రతి ఫిర్యాదును పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేస్తారు. ఎక్కువ మందిని ఇబ్బందిపెట్టే సమస్యలను గుర్తించి భూపరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

  • ఈ విషయమై మెళియాపుటి తహసీల్దార్‌ పాపారావు వద్ద ప్రస్తావించగా.. ‘‘ఒక నెల.. ఒక గ్రామం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గురువారం మండలంలోని ఒక్కో గ్రామంలో నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహిస్తాం. తప్పులు లేకుండా భూముల రికార్డులు సరిచేస్తాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల’ని తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 12:18 AM