తాగునీటి కష్టాలకు చెక్!
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:39 PM
Rs. 121.99 crore for Palasa Municipality పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 31 వార్డులు.. లక్షకుపైగా జనాభా ఉన్న ఈ మునిసిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకాలేవీ లేవు. దీంతో వేసవి వచ్చిందంటే చాలు.. అన్నీ వార్డుల్లోనూ తాగునీటి కష్టాలే.
పలాస మునిసిపాలిటీకి రూ.121.99 కోట్లు
ఆఫ్‌షోర్ ఆధారిత పథకానికి ఆమోదం
ఫలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రయత్నం
పలాస, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 31 వార్డులు.. లక్షకుపైగా జనాభా ఉన్న ఈ మునిసిపాలిటీలో శాశ్వత మంచినీటి పథకాలేవీ లేవు. దీంతో వేసవి వచ్చిందంటే చాలు.. అన్నీ వార్డుల్లోనూ తాగునీటి కష్టాలే. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేందుకు ఏటా రూ.40లక్షలకుపైగా వెచ్చించేవారు. గత ప్రభుత్వాలు నీటి కోసం ప్రయత్నించినా విఫలమయ్యాయి. ప్రస్తుతం వంశధార ఆధారిత చెరువుల వద్ద భారీ బావులు నిర్మించి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. నీటి కష్టాలు తొలగించేలా ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేశారు. దీనిపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.నారాయణ స్పందిస్తూ.. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు శాశ్వత తాగునీటి పథకం కోసం రూ.121.99 కోట్లు మంజూరు చేశారు. ఇటీవల జీవో 467 విడుదల చేశారు. పలాస మండలం రేగులపాడు వద్ద శరవేగంతో నిర్మిస్తున్న ఆఫ్‌షోర్ జలాశయం నుంచి నీటిని తీసుకువచ్చేందుకు ఈ పథకం రూపొందించబడింది. ఎమ్మెల్యే కృషి మేరకు ఇప్పటికే ఉద్దానం రక్షిత నీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. దీర్ఘకాలిక అవసరాలకు ఆఫ్‌షోర్ ఆధారిత నీరు ఎంతో వినియోగపడుతోంది. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి కూడా శాశ్వత తాగునీటి పథకం మంజూరు కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటా కుళాయిల ద్వారా..
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 18వేలకు పైగా నివాసాలు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 1300 ఇళ్లకే తాగునీరు కుళాయిల ద్వారా అందిస్తున్నారు. మిగిలిన ఇళ్లకు సొంతంగా బోరులు, పబ్లిక్ కుళాయిలు, పవర్‌బోర్ల ద్వారా తాగునీరు అందుతోంది. మొత్తం ప్రజల అవసరాలకు సరిపడా నీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.121.99 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం కార్యరూపం దాల్చడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్దానం రక్షితనీటి పథకం ద్వారా తాగునీరు అందుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు గతేడాది రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించగా సానుకూలంగా స్పందిస్తూ ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చింది. రూ.15 లక్షలు వెచ్చించి ఉద్దానం రక్షితనీటి పథకం పైపులైన్‌కు మునిసిపల్ ట్యాంకులకు అనుసంధానించారు. చిన్నచిన్న సాంకేతిక అవరోధాలు అధిగమిస్తే పూర్తిస్థాయి నీరు వచ్చే అవకాశం ఉంది. కోసంగిపురం వద్ద ఉన్న ప్రధానంగా ఉన్న ఉద్దానం పైపులైను నుంచి రెండు కిలోమీటర్ల పొడవునా పైపులు వేస్తే సరిపడా నీరు అందుతుంది.
వాస్తవానికి జలజీవన్‌మిషన్ పథకం ద్వారా పలాస-ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు వంశధార నది నుంచి గొట్టాబ్యారేజీ.., అక్కడ నుంచి వివిధ దశల ద్వారా నీరు వస్తుంది. అందులో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటిని గత వైసీపీ పాలకులు అనుసంధానం చేయలేకపోయారు. మునిసిపాలిటీ పైనుంచే పైపులైన్లు ద్వారా నీరు వెళ్తున్నా చుక్క నీరు కూడా ఇక్కడకు వచ్చే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యే గౌతు శిరీష అనేకసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు నీటి సమస్య విన్నవించారు. దీంతో తాత్కాలికంగా నీటి అవసరాలు తీర్చడానికి ఉద్దానం రక్షిత నీరు అందించారు. శాశ్వత పథకం కావాలని కోరడంతో ఆఫ్‌షోర్ ఆధారిత తాగునీటికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం పూర్తి కార్యరూపం దాల్చితే పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘానికి శాశ్వత తాగునీరు లభించినట్లే.