మురుగు సమస్యకు చెక్
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:27 PM
Mapping for canals పలాస కేటీ రోడ్డు వద్ద ఉన్న కాలువ నిత్యం చెత్తతో నిండి ఉంటుంది. వర్షాలు పడితే తప్ప.. ఆ చెత్త కదలదు. చెత్త కారణంగా దుర్వాసన వెదజల్లుతుండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మున్సిపాల్టీల్లోని కాలువలకు మ్యాపింగ్
ప్రతిరోజూ చెత్త తొలగింపునకు చర్యలు
విధివిధానాలు జారీ
పలాస, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పలాస కేటీ రోడ్డు వద్ద ఉన్న కాలువ నిత్యం చెత్తతో నిండి ఉంటుంది. వర్షాలు పడితే తప్ప.. ఆ చెత్త కదలదు. చెత్త కారణంగా దుర్వాసన వెదజల్లుతుండడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక నుంచి ఇలాంటి సమస్యలు ఉండవు. ఇందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాల్లోని కాలువలను మ్యాపింగ్ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానం ద్వారా ప్రతిరోజూ కాలువల్లో చెత్తను తొలగించడంతోపాటు వాటి ఫొటోలను పట్టణాభివృద్ధిశాఖ పోర్టర్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత విధివిధానాలు మునిసిపాలిటీలకు చేరాయి. మొత్తం ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి.. అందులో ఎంత మేరకు చెత్త వస్తుంది.. పెద్ద కాలువలు ఎన్ని, మధ్య, చిన్న కాలువలు ఎన్ని, వాటి పనితీరు ఏ విధంగా ఉంది. కాలువల నిర్వహణ.. నాణ్యతగా ఉన్నాయో లేదో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థ కోరింది. దీంతో మునిసిపాలిటీలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి.
జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో శ్రీకాకుళం కార్పొరేషన్, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు ఉన్నాయి. మొత్తం వంద కిలోమీటర్ల పొడవునా కాలువలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక నుంచి ప్రతి మురుగు కాలువను మ్యాపింగ్ చేసి నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం శుభ్రం చేయడానికి పురపాలక సంఘాలు చర్యలు ప్రారంభించాయి. పెద్ద, మధ్య, చిన్నతరహా కాలువలుగా విభజించి మ్యాపింగ్ చేస్తారు. చిన్న కాలువలను నిరంతరం పర్యవేక్షిస్తు అందులో చెత్తను బయటకు తీసి మురుగునీరు సులభంగా వెళ్లడానికి మార్గం కల్పిస్తారు. మధ్యరకం కాలువల్లో చెత్తను తీయడంతోపాటు పెద్ద కాలువల్లోకి నీరు మరలించే విధంగా చర్యలు తీసుకుంటారు. దీన్ని నిరంతరం పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించాలి. పెద్ద కాలువలను ప్రతి మూడు రోజులకు ఒకసారి పరిశీలించడంతో పాటు అందులో చెత్తను ఎత్తివేసి శుభ్రం చేయాలి. ఇలా మూడు రకాల కాలువల్లో పనులు చేపడుతూ ఎప్పటికప్పుడు వాటిని మ్యాపింగ్ చేయాల్సి ఉంది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ ఈ పనులు చేపట్టడానికి పట్టణాభివృద్ధిశాఖ తగు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను అమలు చేయాలని సూచించింది. తద్వారా దీర్ఘకాలిక నీటి ముంపు సమస్యలు, వరద ప్రమాదాలు తగ్గించడం, పారిశుధ్య ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు కార్మికుల భధ్రతను లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం కాలువల నిర్వహణ బాధ్యతంతా కమిషనర్లే చూసుకోవాలి. యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత తప్పనిసరిగా పాటించాలి.
కసరత్తు ప్రారంభించాం
కాలువల నిర్వహణ, మ్యాపింగ్‌పై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై కసరత్తు ప్రారంభించాం. మునిసిపాలిటీలో కాలువల పరిధి ఎంతవరకూ ఉందో పరిశీలిస్తాం. వీటిని మూడు రకాలుగా విడదీసి మ్యాపింగ్ చేస్తాం. ఈ ప్రక్రియ ప్రారంభమైతే పారిశుధ్యం మరింత మెరుగుపడుతుంది.
-ఇ.శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనర్, పలాస-కాశీబుగ్గ