బోగస్ హాజరుకు చెక్
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:09 AM
Face-to-face attendance in higher education institutions ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ముఖ ఆధారిత(ఫేషియల్ రికగ్నైజేషన్) హాజరు విధానాన్ని తీసుకొచ్చింది.
ఉన్నత విద్యాసంస్థల్లో ముఖఆధారిత హాజరు
70 శాతం నమోదైతేనే ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్
నరసన్నపేట, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల హాజరు అక్రమాలకు అడ్డుకట్టు వేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ముఖ ఆధారిత(ఫేషియల్ రికగ్నైజేషన్) హాజరు విధానాన్ని తీసుకొచ్చింది. బీసీ హాస్టళ్లలో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. ఉన్నత విద్యాసంస్థల్లోనూ కచ్చితంగా దీనిని అమలు చేయాలని ఇటీవల ఉన్నతవిద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 12 బీఈడీ కళాశాలలు, 114 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు, 12 ఫార్మశీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ఏటా 15వేలమందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు.
ముఖ్యంగా ఉపాధ్యాయ శిక్షణ అందించే బీఈడీ, డీఈడీ అలాగే ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలో భారీస్థాయిలో హాజరు అక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు గైర్హాజరైనా హాజరు వేస్తున్నారు. పరీక్షలకు మాత్రమే హాజరయ్యేలా విద్యార్థులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అలాగే కళాశాలల్లో అధ్యాపకులు లేకపోయినా ఉన్నట్లు చూపి యాజమాన్యాలు మాయాజాలం చేస్తున్నాయి. ఈ అక్రమాలకు ముఖ ఆధారిత హాజరు విధానం చెక్ పెట్టనుంది. ఈ విధానం వల్ల ఉన్నత విద్యాసంస్థల్లో ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో ఉపకార వేతనాలు అందుకుంటూ డుమ్మాకొట్టి తిరిగేవారి ఆటలు చెల్లవు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేకుండా కళాశాలలు నిర్వహించడం సాధ్యం కాదు. అడ్మిషన్ పొందిన ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ముఖ ఆధారిత హాజరు వేయాల్సిందే. విద్యాసంవత్సరంలో 70శాతానికి పైగా హాజరు ఉంటేనే ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు అర్హత ఉంటుంది. అధ్యాపకులు హాజరుతో కళాశాలలు కచ్చితంగా మొరుగైన బోధన అందించేందుకు అవకాశం ఉంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
పకడ్బందీగా..
రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నాం. కళాశాలలకు గైర్హాజరయితే నేరుగా ఉన్నత విద్యాశాఖ పోర్టల్‌లో నమోదవుతుంది. ఈ విధానంలో బోగస్ హాజరు వేసేందుకు అవకాశం ఉండుదు. ఐరిస్, చేతి ముద్రలు ద్వారా హాజరు నమోదవుతుంది. అకడమిక్ సంవత్సరంలో 75 శాతం కన్నా హాజరు తక్కువగా ఉంటే.. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ రాదు.
- ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, రిజిస్ట్రార్, అంబేడ్కర్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల