Share News

Divyang Shakti Scheme:చంద్రబాబుతోనే దివ్యాంగులకు గుర్తింపు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:19 AM

Divyang Shakti Scheme:‘దివ్యాంగులతో ముఖ్యమంత్రి చంద్రబాబుది విడదీయరాని బంధం. సమాజంలో వారికి సమాన గుర్తింపు కల్పించేందుకు సీఎం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు.

Divyang Shakti Scheme:చంద్రబాబుతోనే దివ్యాంగులకు గుర్తింపు
దివ్యాంగునికి జీరో చార్జీ బస్సు టికెట్‌ అందజేస్తున్న మంత్రి

- మంత్రి అచ్చెన్నాయుడు

- దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

అరసవల్లి/శ్రీకాకుళంరూరల్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘దివ్యాంగులతో ముఖ్యమంత్రి చంద్రబాబుది విడదీయరాని బంధం. సమాజంలో వారికి సమాన గుర్తింపు కల్పించేందుకు సీఎం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారు. దివ్యాంగులకు గుర్తింపు, గౌరవం చంద్రబాబుతోనే సాధ్యం’. అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంరూరల్‌ మండలం రాగోలులో ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలసి ఆయన దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు దివ్యాంగులతో ఆప్యాయంగా మాట్లాడారు. పెన్షన్‌ వస్తుందా, ఎంత వస్తోంది, భార్యాబిడ్డలు ఎలా ఉన్నారు, ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.15వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. జిల్లాలో 42వేల మంది దివ్యాంగులకు గాను ఇంతవరకు 3,400 మంది దివ్యాంగ శక్తి బస్సు పాసులు తీసుకున్నారని, మిగిలిన వారు కూడా తీసుకోవాలన్నారు. అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో బస్‌ పాసులు జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. మహిళలకు గ్యాస్‌ సమస్య లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్టాండ్లలో దివ్యాంగులు బస్సు ఎక్కేందుకు గాను ర్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ నెల మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ‘స్వాభిమాన్‌’ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని, సమస్యలు ఉంటే ‘స్వాభిమాన్‌’లో సంప్రదించాలన్నారు. దివ్యాంగ శక్తి పథకాన్ని జిల్లాలోని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనాలు చేశారు. కార్యక్రమంలో డీపీటీవో అప్పలనారాయణ, డిపో మేనేజర్లు అమరసింహుడు, శర్మ, దివ్యాంగుల శాఖ ఏడీ బి.శైలజ, తహసీల్దార్‌ ఎస్‌.గణపతిరావు, ఎంపీడీవో వి.సూర్యప్రకాస్‌ రావు, పీఆర్వో శ్రీనివాసరావు, పీఎంజే బాబు, గేదెల శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:19 AM