చలో భోగాపురం
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:50 PM
Let's go to Modi's meeting on August 1st విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఆగస్టు 1న విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి 792 బస్సుల్లో 35వేల మంది జనాభా తగ్గకుండా తరలించే పనిలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆగస్టు 1న మోదీ సభకు పోదాం పదండి
జిల్లా నుంచి 792 బస్సుల ద్వారా 35వేల మంది తరలింపునకు సన్నాహాలు
టెక్కలి, జూలై 27(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఆగస్టు 1న విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి 792 బస్సుల్లో 35వేల మంది జనాభా తగ్గకుండా తరలించే పనిలో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభకు జనసేకరణలో భాగంగా 340 ఆర్టీసీ బస్సులు, 452 ప్రైవేట్ బస్సులు, మ్యాక్సీక్యాబ్‌లు సిద్ధం చేస్తున్నారు. మండలస్థాయిలో మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్, ఏపీవో, ఏపీఎం ఇలా పలు శాఖల అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఉదయం 5గంటలకే క్షేత్రస్థాయిలో బస్సులు బయలుదేరేలా భోగాపురం విమానాశ్రయ ప్రాంతానికి 8గంటల లోపు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బస్సుల్లో వెళ్లేవారికి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించేందుకు రెవెన్యూ అధికారులు పరవేక్షణ చేస్తుండగా, వాటర్‌బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి బస్సుల్లో ఇచ్చేందుకు ఐసీడీఎస్ యంత్రాంగం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలవారీగా నిర్దేశించిన జనాభాను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డీఆర్‌డీఏ, డ్వామా శాఖల అధికారులు ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు అంశమై దిశానిర్దేశం చేశారు.
భోగాపురానికి దగ్గరగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఉంది. ఈ ప్రాంతం నుంచి 450 బస్సుల ద్వారా 20వేల మందికి తరలించేందుకు, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 93 బస్సుల ద్వారా నాలుగువేల మందిని, ఆమదాలవలస నియోజకవర్గం నుంచి 45 బస్సుల ద్వారా రెండువేల మందిని, నరసన్నపేట నియోజకవర్గం నుంచి 34 బస్సులు ద్వారా 1,500మందిని తరలించాలని భావిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 90 బస్సుల ద్వారా నాలుగువేల మందిని, పాతపట్నం నియోజకవర్గం నుంచి 34 బస్సుల ద్వారా 1,500మందిని, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల నుంచి చెరో 23 బస్సులు ద్వారా వెయ్యేసి మంది చొప్పున బయలుదేరేలా అధికారులు లక్ష్యాలను సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట ఆదివారం జిల్లా కేంద్రంలో డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో రంగోళి పోటీలు నిర్వహించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో టూరిజం ప్రమోషన్, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో విమానయాన విజయోస్తు, విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు, క్రీడా శాఖ ఆధ్వర్యంలో బ్యాడ్మెంటిన్ పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ మోదీ పర్యటన ఏర్పాట్లు అంశమై ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.