రేపు శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానం
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:02 AM
Chakratirtham.. srimukhalingam మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగం వద్ద వంశధారనదిలో బుధవారం శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
ఉత్సవాలకు సిద్ధమైన నంది వాహనం
జలుమూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగం వద్ద వంశధారనదిలో బుధవారం శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు ధరించి.. పూలమాలలతో అలంకరించి.. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ నంది వాహనంపై ఊరేగిస్తారు. వంశధార నది మిరియాపల్లి రేవు వద్దకు తీసుకెళ్తారు. అక్కడ చక్రతీర్థ స్నానం చేయిస్తారు. ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈమేరకు దేవదాయశాఖ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నంది వాహనాన్ని సిద్ధం చేశారు. చక్రతీర్థ స్నానాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష అధికారులను ఆదేశించారు. వంశధార నదిలో ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. భక్తుల రద్దీకి తగ్గట్లు నదిలో నీటి ప్రవాహాన్ని పెంచాలని వంశధార డీఈకి సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ జె.రామారావుకు సూచించారు. నదిలోకి వచ్చే మార్గంలో నాలుగులైన్ల బారికేడ్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు కూడా ఏర్పాట్లు పరిశీలించి.. ఎస్‌ఐ అశోక్‌బాబుకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్.ఐ జగదీష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, సర్పంచ్ టి.సతీష్‌కుమార్, ఆలయ పాలకమండలి చైర్మన్ శివప్రసాద్ పాడి పాల్గొన్నారు.