సెస్ వసూళ్లతోనే సరి!
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:57 PM
What is the benefit of market committees? వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లతో రైతులకు ఆశించినస్థాయిలో ప్రయోజనాలు దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పండించే పంటల నుంచి ఒక శాతం సెస్ రూపంలో మార్కెట్ కమిటీలకు ఆదాయం వస్తుంది. కాగా సిబ్బంది జీతాలుకే తప్ప రైతులకు పైసాకూడా ఖర్చు చేసిన పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు.
మార్కెట్ కమిటీలతో ప్రయోజనమేదీ?
రైతులకు సక్రమంగా అందని సేవలు
పంటల నిల్వకు తప్పని ఇబ్బందులు
మెళియాపుట్టి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ)లతో రైతులకు ఆశించినస్థాయిలో ప్రయోజనాలు దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పండించే పంటల నుంచి ఒక శాతం సెస్ రూపంలో మార్కెట్ కమిటీలకు ఆదాయం వస్తుంది. కాగా సిబ్బంది జీతాలుకే తప్ప రైతులకు పైసాకూడా ఖర్చు చేసిన పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. వైసీపీ ప్రభుత్వ పాలనలో మార్కెట్ కమిటీలకు వచ్చిన ఆదాయాన్ని వివిధ కార్పొరేషన్లకు మళ్లించారు. దీంతో మార్కెట్ కమిటీలు నిర్వీర్యమయ్యాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు నిధులు మంజూరు చేస్తున్నా రైతుల కోసం ఖర్చు చేసిన పరిస్థితి లేదనే విమర్శలు ఉన్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలోని పలాస, నరసన్నపేట, ఇచ్ఛాపురం, పాతపట్నం తదితర ప్రాంతాల్లో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటికి రైతులు పండించే పంటల నుంచి ఒక శాతాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తారు. ఈ మేరకు గత రెండేళ్లలో ఆదాయం తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగింది. 2023-24లో రూ.18.01 కోట్లు లక్ష్యం కాగా, రూ.17.43 కోట్లు వసూలయ్యాయి. 2024-25లో రూ.18.02 కోట్లు లక్ష్యం కాగా.. రూ.18.16 కోట్ల ఆదాయం సమకూరింది. 2025-26లో రూ.20.93 కోట్లు లక్షలు లక్ష్యం కాగా.. రూ.21.76 కోట్లకుపైగా వసూలైనట్టు అధికారులు వెల్లడించారు. ఆదాయం పెరిగినా రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ కమిటీలకు సొంత భవనాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సిబ్బంది చేతివాటం చూపి.. ఆదాయం పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నిల్వ చేసుకోలేక..
గతంలో రైతులు పండించే పంటలను మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచి.. ధరలు పెరుగుదల కనిపించినప్పుడు విక్రయించుకునేలా ఏర్పాటు చేశారు. రైతుబంధు పథకం కింద పంట నిల్వలో 75 శాతం రైతులకు రుణాలు సైతం ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఈ పరిస్థితి కనిపించడం లేదు. రైతులు నిల్వ చేసుకునే అవకాశం లేక పంటలను కల్లాల్లోనే విక్రయిస్తున్నారు. దీనివల్ల వ్యాపారులు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏఎంసీ నిధులతో పశువైద్య శిబిరాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు రహదారులు సైతం నిర్మించేవారు. ప్రస్తుతం నిధులేవీ మంజూరు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏఎంసీల ద్వారా తమకు ప్రయోజనాలు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.