కాసుల కోసం కోతలు!
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:24 AM
Rising number of Caesarean in the srikakulam కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేసి డబ్బులు గుంజుతున్నారు. కొందరైతే ముహూర్తాల పిచ్చిలో సిజేరియన్ల ద్వారా బిడ్డలను కంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో సగానికి పైగా(51శాతం) సిజేరియన్లే ఉండడంతో ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
జిల్లాలో పెరిగిపోతున్న సిజేరియన్లు
అవసరం లేకున్నా కడుపు కోత
ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అధికం
జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువు
బిడ్డ అడ్డం తిరిగిందంటారు. ఉమ్మనీరు తాగిందంటారు. బిడ్డ బరువు ఎక్కువగా ఉందంటారు. ఆలస్యం చేస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదమని హడలెత్తిస్తారు. చివరకు కడుపుకోసి బిడ్డను బయటకు తీస్తారు. వేలాది రూపాయలు డబ్బులు దండుకుంటారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇదే జరుగుతోంది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ఎవరైనా ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు సిజేరియన్లపై రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన చేసే పరిస్థితి ఉంటే దీనితీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పలాస, జూలై 25(ఆంధ్రజ్యోతి):
ఉద్దానం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి పలాస-కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రసవానికి వచ్చింది. ఆమెకు నెలలు నిండి సాధారణ డెలివరీకి అవకాశం ఉన్నా సిజేరియన్ చేస్తే తప్ప బిడ్డ పుట్టడం కష్టమని వైద్యులు చెప్పారు. ఆలస్యం అయితే ప్రమాదమని బెదిరించారు. దీంతో చేసేదేమీలేక గర్భిణి కుటుంబీకులు సిజేరియన్‌కు అంగీకరించారు.
కొన్ని సంవత్సరాల క్రితం 108 అంబులెన్స్ వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి ఓ గర్భిణి డెలివరీ కోసం వస్తే బిడ్డ అడ్డం తిరిగింది ఎనస్థిసియా లేరంటూ ఇక్కడి వైద్యులు రెఫర్ చేశారు. తీరా నియోజకవర్గంలో ఓ పీహెచ్‌సీకి తరలించడంతో అక్కడ ఎలాంటి ఆపరేషన్ లేకుండా సాధారణ డెలివరీ కావడంతో అప్పట్లో పలాస వైద్యులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
సాధారణ డెలివరీకి అవకాశం ఉన్నా..
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు చేసి డబ్బులు గుంజుతున్నారు. కొందరైతే ముహూర్తాల పిచ్చిలో సిజేరియన్ల ద్వారా బిడ్డలను కంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో సగానికి పైగా(51శాతం) సిజేరియన్లే ఉండడంతో ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ యాదవ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలపై సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని మూడేళ్లలో 35 శాతానికి తగ్గించడానికి పటిష్టమైన కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను జిల్లాస్థాయిలో అధికారులు అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కారణం జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటప్పుడు మంత్రి ఆదేశాలను ఏమేరకు పరిగణనలోకి తీసుకుంటారో వేచిచూడాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం ఆ సంఖ్య 15 శాతానికి మించి సిజేరియన్లు ఉండకూడదు.
కారణాలు ఇవే:
వాణిజ్య ప్రయోజనాల కోసం కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రోగుల బలహీనత బట్టి వారికి మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ సిజేరియన్లను ప్రేరేపిస్తున్నారు. సాధారణ ప్రసవాలకు వేచిఉండడం గర్భిణులకు కూడా ఇబ్బందికరంగా ఉండడంతో సిజేరియన్లుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ధోరణి తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ల ద్వారా బిడ్డను బయటకు తీస్తున్న పరిస్థితి ఎక్కువయింది.
మంచి ముహూర్తంలో బిడ్డ పుడితే జీవితాంతం వారు సుఖసంతోషాలతో ఉంటారని ఇంకొందరు నమ్ముతుంటారు. ఈ కారణంగా అనుకున్న ముహూర్తానికి సిజేరియన్లు చేస్తున్న వింతపోకడలు ఇటీవల ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంది.
సిజేరియన్ల వల్ల తల్లిబిడ్డలపై దుష్ట్రభావం ఎక్కువగా పడే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. సహజ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్లు అనేది పెద్ద శస్త్రచికిత్స. దీనివల్ల తల్లికి రక్తస్రావంతో పాటు ఇన్ఫెక్షన్లు, నడుంనొప్పులు, భవిష్యత్తులో కూడా గర్భస్రావం కలగవచ్చు. ఆపరేషన్ ద్వారా పుట్టిన బిడ్డలకు శ్వాసకోస సమస్యలు, రోగ నిరోధకశక్తి తగ్గడం, ఉబకాయం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
విస్తృత ప్రచారం అవసరం:
గర్భిణులు, వారి కుటుంబీకులకు సాధారణ ప్రసవాలపై అవగాహన అవసరం. సాధారణ ప్రసవాల ప్రాముఖ్యతపై గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ, సామాజిక కార్యకర్తల ద్వారా విశేష ప్రచారం కల్పించాల్సి ఉంది. లేనిదానికి, కానిదానికి సిజేరియన్లు చేస్తే ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యారోగ్యశాఖ నిఘా పెట్టాలి. వైద్యారోగ్యశాఖ నిరంతరం ప్రైవేటు ఆసుపత్రులపై జరుగుతున్న ప్రసవాలపై నివేదిక కోరడంతో పాటు సిజేరియన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందనే తెలుసుకోవాలి. ఇలా చేస్తే దీన్ని తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. సహజ ప్రవసవాలు, సిజేరియన్ ప్రసవాలకు ఎంతో తేడా ఉంటుంది. ఆ తల్లికి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిస్థితే ఇందుకు ఉదాహరణలుగా చెప్పచ్చు.
సిజేరియన్లు ఎప్పుడు చేయాలంటే..
అవసరం ఉన్నవారికే సిజేరియన్లు చేయాలని వైద్యనిపుణులు, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు చెబుతున్నారు. ఇందుకు విరుద్ధంగా ఇక్కడ పరిస్థితి ఉంది.
బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, డెలివరీ కష్టంగా మారినప్పుడు, బిడ్డ ఎదుగుదల సక్రమంగా లేనప్పుడు
కడుపులో బిడ్డకు సక్రమంగా ఆక్షిజన్ అందనప్పుడు, లేదా గుండె స్పందనలో మార్పులు జరిగినప్పుడు
డెలివరీ సమయంలో గర్భాశయద్వారం సక్రమంగా తెరుకోనప్పుడు, ప్రసవ నొప్పులు ఆగకనప్పుడు
ఉమ్మనీరు తగ్గిపోవడం, పురుడు నొప్పుల సమయంలో ఉమ్మనీరు రక్తంగా మారినప్పుడు
బొడ్డుతాడు మెడకు చుట్టుకుపోవడం, బిడ్డకు ఊపిరి ఆడకపోవడం,
తల్లికి అనారోగ్య సమస్యలు, బిడ్డకు సంబంధించిన సమస్యలు, బిడ్డ బరువు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు
ఆలా్ట్రసౌండ్ స్కానింగ్‌లో బిడ్డ ఎదుగుదల అసాఽధారణంగా ఉన్నప్పుడు, నూకల్ కార్డ్ సమస్యలు గుర్తించినప్పుడు
మావి ముందుగానే గర్భాశయం నుంచి జారిపడిపోయినప్పుడు
జిల్లాలో శ్రీకాకుళంతో పాటు నరసన్నపేట, టెక్కలి, పలాస-కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం ప్రాంతాల్లో ఎక్కువగా ప్రైవేటు క్లినిక్, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. దీంతో పాటుగా జిల్లాలో రిమ్స్, టెక్కలి జిల్లా ఆసుపత్రితో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో అధికంగా డెలివరీ కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస-కాశీబుగ్గలో ట్రోమా కేంద్రాలు ఉన్నాయి. కేవలం గర్భిణులకు సహాయం అందించడానికి ఈ కేంద్రాలు పనిచేస్తాయి.
సిజేరియన్ల ధరలు ఇలా
--------------------------------------------
పలాస-కాశీబుగ్గ నరసన్నపేట టెక్కలి శ్రీకాకుళం
------------------------------------------------------------------------
సాధారణ సిజేరియన్ రూ.30,000 28,000 25,000 45000
అత్యవసర పరిస్థితిలో రూ.40,000 35,000 30,000 75,000
లేజర్ చికిత్స ద్వారా రూ.75,000 50,000 40,000 1,00,000